NTR centennial celebrations: ఎన్టీఆర్ ప్రభావం నాపై ఎంతో ఉంది.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం.. రజనీ స్పష్టం-rajinikanth prasies ntr in ntr centennial celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr Centennial Celebrations: ఎన్టీఆర్ ప్రభావం నాపై ఎంతో ఉంది.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం.. రజనీ స్పష్టం

NTR centennial celebrations: ఎన్టీఆర్ ప్రభావం నాపై ఎంతో ఉంది.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం.. రజనీ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Apr 29, 2023 06:03 AM IST

NTR centennial celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తారకరాముడిపై ప్రశంసల వర్షం కురిపించారు. తనపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని తెలిపారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు తదితరులు
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు తదితరులు

NTR centennial celebrations: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజినీ.. తారక రాముడి శత జయంతి వేడుకల్లో హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా తను సినిమాల్లో రావడానికి స్ఫూర్తి అన్నగారేనని స్పష్టం చేశారు. ఆయన నటించిన దానవీర శూర కర్ణ చిత్రం ఎన్నో సార్లు చూశానని చెప్పుకొచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనతో తనకు 30 ఏళ్ల స్నేహముందని తెలిపారు.

"నాపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉంది. ఆయన దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయాను. గద పట్టుకొని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడిని. బస్ కండక్టర్ పనిచేసే చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన సేవా కార్యక్రమాల్లో కురుక్షేత్రం నాటకంలో పాల్గొన్నాను. అందులో దుర్యోధనుడి పాత్ర వేసి అచ్చం ఎన్టీఆర్‌ను అనుకరించాను. ఇది చూసిన తన స్నేహితులు నటుడివి అయితే బాగుంటుందని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారిని, దాన వీర శూర కర్ణలో తారకరాముడిలా ఉండాలనుకున్నాను. ఆయనలా మేకప్ వేసుకుని దిగిన ఫొటోను చూసిన నా స్నేహితుడు కోతిలా ఉన్నావన్నారు." అని రజనీకాంత్ తెలిపారు.

తాను ఎన్టీఆర్‌తో రెండు సినిమాల్లో నటించానని రజినీ తెలిపారు. "అన్నగారితో కలిసి నేను రెండు సినిమాలు చేశాను. ఒకటి తెలుగు చిత్రం టైగర్ కాగా.. రెండోది మణ్ణన్ వాణి(తెలుగులో నిండు మనిషి) అనే తమిళ చిత్రం చేశాను. ఆయనను చూసే కష్టపడటం నేర్చుకున్నాను. 13 ఏళ్ల వయసులో లవకుశ చిత్రం సమయంలో ఎన్టీఆర్‌ను తొలి సారి చూశాను. 18 ఏళ్ల వయసులో ఆయనను ఇమిటేట్ చేశాను. 1977లో ఆయనతో కలిసి సినిమా చేశాను. ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం. అప్పట్లో దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు" అని రజనీ కాంత్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ.. చంద్రబాబుతో తన అనుబంధం గురించి తెలియజేశారు. ఆయనతో తనకు 30 ఏళ్ల స్నేహమని స్పష్టం చేశారు. ఆయన విజన్ ఏంటో మొత్తం ప్రపంచానికి తెలుసని రజనీ అన్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, బాలకృష్ణ సహ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

IPL_Entry_Point

టాపిక్