Tunisha Sharma : ఆమె ప్రెగ్నెంట్ కాదు.. పోలీసుల క్లారిటీ
Tunisha Sharma Death Case : టీవీ నటి తునీషా శర్మ టీవీ షో సెట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె మరణించే సమయంలో గర్భవతి అని చాలా పుకార్లు వచ్చాయి.
మహారాష్ట్ర టీవీ సీరియల్ నటి తునీషా శర్మ(Tunisha Sharma) మరణంపై చాలా పుకార్లు వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియా(Social Media)లో ఆమె మరణించే సమయంలో గర్భవతి అని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రెగ్నెంట్ తో ఉండటమే అని కామెంట్స్ చేశారు. అలీ బాబా: దస్తాన్-ఇ-కాబూల్ అనే టీవీ షో సెట్‌లోనే ఉరి వేసుకొని చనిపోయింది ఆమె. ఈ ఘటన చూసిన వెంటనే తునీషాను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మాజీ ప్రియుడు షీజన్ మహమ్మద్ ఖాన్(Sheezan Mohammed Khan) ప్రమేయంపై వివాదం చెలరేగింది.
ట్రెండింగ్ వార్తలు
తునీషాకు తన సహనటుడు షీజన్ ఖాన్‌తో సంబంధంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె మరణానికి కొన్ని వారాల ముందు ఈ జంట విడిపోయారు. మరణించే సమయానికి ఆమె గర్భవతి అని, కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి షీజన్ ఖాన్ అని కొంతమంది మాట్లాడారు. ఈ పుకార్లకు పోలీసులు స్వస్తి పలికారు. మరణించే సమయంలో గర్భవతి కాదని స్పష్టం చేశారు. తునీషా పోస్ట్‌మార్టం నివేదికలను ముంబైలోని JJ హాస్పిటల్ విడుదల చేసింది.
శవపరీక్ష నివేదికల ప్రకారం, తునీషా శర్మ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని, మరణించే సమయంలో ఆమె గర్భవతి కాదని చెబుతున్నాయి. తునీషా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కూడా నివేదికలు చెబుతున్నాయి. తునీషా తల్లి షీజన్ ఖాన్ పై ఫిర్యాదు చేశారు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు.
తన కుమార్తెతో షీజన్ ఖాన్ 15 రోజుల క్రితం విడిపోయాడని, ఆమె చనిపోవడానికి కారణమై ఉంటుందని శర్మ తల్లి చెప్పారు. మరోవైపు శర్మ మాజీ ప్రియుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అతడి తరపు న్యాయవాది చెబుతున్నారు.
తాజాగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్(MLA Ram Kadam), తునీషా శర్మ మరణం 'లవ్ జిహాద్'(Love Jihad) కేసు కావచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె మాజీ లవర్ వేరే మతానికి చెందినవారని వ్యాఖ్యానించారు. లవ్ జిహాద్ కోణంపై దర్యాప్తు జరుగుతుందని ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు. శర్మ కుటుంబ సభ్యులకు నూరు శాతం న్యాయం జరుగుతుందన్నారు.
'ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఇందులో లవ్ జిహాద్ ఉందా? లేక మరేదైనా సమస్య ఉందా? విచారణలో నిజానిజాలు వెల్లడవుతాయి. తునీషా శర్మ కుటుంబానికి 100 శాతం న్యాయం జరుగుతుంది. ఇది లవ్ జిహాద్ కేసు అయితే, దీని వెనుక ఏ సంస్థలు ఉన్నాయి. కుట్రదారులు ఎవరు అనే విషయాన్ని కూడా పోలీసులు విచారిస్తారు.' అని రామ్ కదమ్(Ram Kadam) అన్నారు. ఈ కేసును అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారని, దోషులను విడిచిపెట్టబోమని బీజేపీ నేత చెప్పారు.