Chandrabose Gift to Soujanya: పాటతో ఆస్కార్ విన్నర్‌ను ఇంప్రెస్ చేసిన సింగర్.. స్పెషల్ గిఫ్ట్ అందజేత
Chandrabose Gift to Soujanya: తన పాటతో ఆస్కార్ విన్నింగ్ గీతరచయిత చంద్రబోస్‌ను ఇంప్రెస్ చేశారు సింగర్ సౌజన్య. ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2కు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబోస్.. ఆమెకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు.
Chandrabose Gift to Soujanya: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 దిగ్విజయంగా నడుస్తోంది. ప్రతి వారం ఎవరోక సెలబ్రెటీ ముఖ్య అతిథిగా హాజరై కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్‌పై మంచి మార్కులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ, కోటి, బాబా సైగల్, ఎస్పీ చరణ్ గెస్టులుగా రాగా.. ఈ వారం చంద్రబోస్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలిచిన చంద్రబోస్ ఈ షోకు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే తమ గానంతో తనను మెప్పించిన వారికి విలువైన బహుమతి ఇస్తానని ఆయన ప్రకటించడంతో అందరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.
టాప్-9లో నిలిచిన కంటెస్టెంట్ల అందరూ చంద్రబోస్‌ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు. తెలుగులో ఐకానిక్ సాంగ్స్‌ను పాడి ఆకట్టుకున్నారు. అయితే వీరందరిలో సౌజన్య భాగవతుల పాడిన పాటకు చంద్రబోస్ ఎక్కుగా ఇంప్రెస్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని చిత్రంలోని పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మ అనే గీతంతో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో వచ్చిన ఈ గీతాన్ని అద్భుతంగా పాడి చంద్రబోస్‌తో పాటు జడ్జీల మనస్సును కూడా దోచుకున్నారు. ఫలితంగా ఆమె బొమ్మ బ్లాక్ బాస్టర్‌ను కూడా అందుకున్నారు.
తనను మెప్పించినందుకు గాను చంద్రబోస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. అ గిఫ్ట్ ఏంటో కాదు.. ఏ పాటకైతే తాను ఆస్కార్ గెలిచారో.. ఆ సాంగ్ రాసిన కలాన్ని(Pen) సౌజన్యకు బహమతిగా అందించారు. అవును నాటు నాటు పాట రాసిన పెన్నును ఆమెకు కానుకగా ఇచ్చారు చంద్రబోస్. ఇంత ప్రత్యేకమైన గిఫ్ట్ అందుకున్న సౌజన్య ఆనందంతో సంబరపడిపోయారు. చంద్రబోస్ పాదాలను తాకుతూ పరవశించిపోయారు. ఈ కలం అందుకోవడం గౌవరంగా భావిస్తున్నానని, సంగీతం పట్ల తన అభిరుచిని ఇలాగే కొనసాగిస్తానని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకంటానని స్పష్టం చేశారు.
ఇండియన్ ఐడల్-2లో గెస్ట్‌గా రావడాన్ని చంద్రబోస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అద్భుతంగా ప్రదర్శన చేసిన సౌజన్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి హేమచంద్ర హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. గాయకులు కార్తిక్, గీతా మాధురి, సంగీత దర్శకుడు తమన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.