Itlu Maredumilli Prajaneekam Movie Review: ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం మూవీ రివ్యూ-itlu maredumilli prajaneekam movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Itlu Maredumilli Prajaneekam Movie Review

Itlu Maredumilli Prajaneekam Movie Review: ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం మూవీ రివ్యూ

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 02:20 PM IST

Itlu Maredumilli Prajaneekam Movie Review: అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సందేశాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం
ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం

Itlu Maredumilli Prajaneekam Movie Review: నాంది స‌క్సెస్ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) హీరోగా న‌టించిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. కామెడీ పంథాకు భిన్నంగా మ‌రోసారి సీరియ‌స్ క‌థాంశాన్ని ఎంచుకొని అల్ల‌రి న‌రేష్ చేసిన సినిమా ఇది. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఏ.ఆర్ మోహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆనంది, వెన్నెల‌కిషోర్‌, సంప‌త్‌రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో అల్ల‌రి న‌రేష్‌కు మ‌రో హిట్ ద‌క్కిందా? సీరియ‌స్ క‌థ‌తో అత‌డు ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

ప్ర‌భుత్వ ఉద్యోగి క‌థ‌

శ్రీనివాస్ (అల్ల‌రి న‌రేష్‌) తెలుగు టీచ‌ర్‌గా ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. అన్యాయాల్ని స‌హించ‌లేని మ‌న‌స్త‌త్వం అత‌డిది. ఎన్నిక‌ల డ్యూటీ కోసం మారేడుమిల్లి గిరిజ‌న‌ ప్రాంతానికి వెళ‌తాడు. ఆ ప్రాంతంలో విద్యా, వైద్యం లాంటి క‌నీస వైద్య స‌దుపాయాలు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటారు. గ్రామ‌స్తుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం, ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ట్టించుకోరు.

తమ స‌మ‌స్య‌లు తీరే వ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని ఆ ఊరి ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. అక్క‌డ‌ వంద శాతం ఓటింగ్ జ‌ర‌పాల‌ని శ్రీనివాస్‌ను క‌లెక్ట‌ర్ త్రివేది (సంప‌త్‌)ఆదేశిస్తాడు. త‌న మంచిత‌నంతో ఊరి ప్ర‌జ‌లంద‌రూ ఓటు వేసేలా ఒప్పిస్తాడు శ్రీనివాస్‌.

ఎన్నిక‌లు స‌జావుగా సాగిన త‌ర్వాత బ్యాలెట్ బాక్స్‌ల‌తో తిరిగివెళ్తున్న అధికారుల‌ను కండా (శ్రీతేజ్‌) కిడ్నాప్ చేస్తాడు. అధికారుల‌ను కండా కిడ్నాప్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ కిడ్నాప్ వెనుక ఎవ‌రున్నారు? ఆ ఊరి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డం కోసం శ్రీనివాస్ వేసిన ఎత్తు ఏమిటి? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

వాస్తవ ఘటనలతో…

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం (Itlu Maredumilli Prajaneekam) సినిమాను వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ మోహ‌న్. అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉన్న ప్రాంత ప్ర‌జ‌లు ప‌డే అవ‌స్థ‌లు, ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు హామీలు ఇస్తూ ఆ త‌ర్వాత వాటిని ప‌ట్టించుకోవ‌డం మానేసిన సంఘ‌ట‌న‌లు అన్నింటిని భాగం చేస్తూ క‌థ‌ను రాసుకున్నాడు. ఆధునిక యుగంలో క‌నీస వైద్య స‌దుపాయాలు లేక ఎన్నో గ్రామాలు ప‌డే అవ‌స్థ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఈ సినిమాలో చూపించారు. ప్ర‌భుత్వం, ప్ర‌జాప్ర‌తినిధులు చేయ‌లేని ప‌నుల‌ను గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగిగా శ్రీనివాస్ ఎలా చేశాడ‌నేది సందేశాత్మ‌కంగా ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకంలో ఆవిష్క‌రించారు.

పాయింట్ బాగున్నా...

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం (Itlu Maredumilli Prajaneekam Movie Review)కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ ఈ క‌థాంశంతో తెలుగు తెర‌పై ఇదివ‌ర‌కు చాలా సినిమాలు రావ‌డం మైన‌స్‌గా మారింది. స్క్రీన్‌ప్లే ఆద్యంతం ఊహ‌ల‌కు అందేలా ఉంటుంది. తెలిసిన క‌థ‌ను చెబుతున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేసేలా స్క్రీన్‌ప్లే, మ‌లుపులు రాసుకోవాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. మారేడుమిల్లిని డెవ‌ల‌ప్ చేయ‌డానికి హీరో వేసే ప్లాన్ కూడా సులువుగా గెస్ చేసేలా ఉంటుంది. న‌రేష్‌, ఆనంది ల‌వ్ ట్రాక్ సినిమా మైలేజ్ పెంచ‌డానికి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

అల్ల‌రి న‌రేష్ క్యారెక్ట‌ర్ బ‌లం...

శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడిగా సీరియ‌స్ రోల్‌లో ఇంటెన్స్ యాక్టింగ్‌తో న‌రేష్ ఆక‌ట్టుకున్నాడు. చాలా స‌హ‌జంగా న‌టించాడు. వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్ కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. క‌లెక్ట‌ర్ త్రివేదిగా సంప‌త్‌తో పాటు ఆనంది, శ్రీతేజ్ పాత్ర‌ల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు.

Itlu Maredumilli Prajaneekam- రొటీన్ సినిమా...

ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో సందేశం బాగున్నా కొత్త‌ద‌నం క‌రువైంది. హిట్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే న‌రేష్ కెరీర్‌లో మ‌రో మంచి ప్ర‌య‌త్నంగా మాత్రం మిగులుతుంది.

రేటింగ్ : 2.5 /5

IPL_Entry_Point