Godfather Pre Release Event: గాడ్ ఫాదర్ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ చరణ్ - ప్రీ రిలీజ్ వేడుకకు చిరు స్పీచ్ హైలైట్
Godfather Pre Release Event: అభిమానులే తన గాడ్ ఫాదర్స్ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సినిమా చేయడానికి రామ్ చరణ్ ప్రధాన కారణం అని చెప్పాడు. బుధవారం అనంతపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గాడ్ ఫాదర్ సినిమా గురించి చిరంజీవి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆయన స్పీచ్ వేడుకకు హైలైట్‌గా నిలిచింది.
Godfather Pre Release Event: అందరూ తనను గాడ్ ఫాదర్ అంటుంటారని, కానీ ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకు ఈ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం ఇచ్చిన ప్రతి అభిమానిని తాను గాడ్ ఫాదర్ గానే భావిస్తానని అన్నాడు చిరంజీవి(Chiranjeevi). అతడు హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం అనంతపూర్ లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న సమయంలో భారీగా వర్షం కురిసింది. వర్షంలో తడుస్తూనే అభిమానులతో చిరంజీవి ముచ్చటించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. పొలిటికల్ క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెందులలో వర్షం కురిసింది. ఇంద్ర సినిమాలోని వాన పాటను ఇక్కడే చిత్రీకరించాం. ఆ సమయంలో నిజంగానే వర్షం పడింది. ఈ రోజు వాన పడటం శుభపరిణామంగా అనిపిస్తోంది. రాయలసీలో వర్షాలు పడక నేల నెర్రలు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు వర్షాలు పడతాయి అనే సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది.
చరణ్ ఈ సినిమాను సూచించాడు…
లూసిఫర్ సినిమా మలయాళంలో రిలీజ్ అయినప్పుడు చూశా. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రధాన కారణం రామ్ చరణ్(Ramcharan). నటుడిగా నాకు వైవిధ్యంగా ఉంటుంది అనుకొని చరణ్ ఈ సినిమాను సజెస్ట్ చేశాడు. మీ ఇమేజ్ కు తగ్గ కథ ఇది, ఈ సమయంలో చేయాల్సిన సరైన సినిమా ఇదే అంటూ చరణ్ చెప్పాడు. ఈ సినిమాను ధైర్యంగా ఎవరు నిర్మిస్తారు అనుకున్నప్పుడు తానే ముందుకొచ్చి తీశాడు. చరణ్ కోరిక మేరకు ఈ సినిమా చేయగలిగాను.
కథ వినకుండానే…
దర్శకుడిగా మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. అందరూ గర్వపడే స్థాయిలో మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో దళపతిలా నా వెన్నంటి నిలబడే పాత్రకు పెద్ద స్థాయి ఇమేజ్ ఉన్న నటుడు కావాలి, అందుకు సల్మాన్ ఖాన్ బెటర్ అని సింపుల్ గా మోహన్ రాజా నాతో చెప్పాడు. సల్మాన్ ఖాన్ (Salman khan) ఒప్పుకుంటాడా అని నేను అనుకున్నా. చరణ్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఒకే ఒక ఫోన్ కాల్ తో అతడిని ఒప్పించాడు. మలయాళ సినిమా చూడకుండా, కథ వినకుండా మాపై నమ్మకంతో డైరెక్ట్ గా షూటింగ్ లో పాల్గొన్నాడు సల్మాన్.
యూట్యూబర్ గా పూరి
క్యారెక్టర్ నచ్చి నయనతార (Nayanthara) ఈ సినిమా అంగీకరించింది. ఆమె ఒప్పుకోవడం సినిమా విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నాం. చివరలో ఆమె పండించిన సెంటిమెంట్ హైలైట్ గా నిలుస్తుంది. విలన్ గా సత్యదేవ్ నటించాడు. యూట్యూబర్ క్యారెక్టర్ లో పూరి జగన్నాథ్ కనిపించాడు. అతడి పాడ్ కాస్ట్ విని పూరి జగన్నాథ్ ను సినిమాకోసం సెలెక్ట్ చేశాం. తన మ్యూజిక్ తో ఆరో ప్రాణం పెట్టి తమన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. తెలుగు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం అరుదు. కానీ చిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి చూపించాడు.
కంటిచూపుతో హీరోయిజం
కంటిచూపుతో సైలెంట్ గా హీరోయిజాన్ని పండించేలా నా క్యారెక్టర్ తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు తమన్. ఫ్యామిలీ, పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా అందరిని అలరిస్తుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్ మాకు శిరోధార్యం. మీ తీర్పును ఎప్పుడూ గౌరవిస్తా. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ సహజమే. గత చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాననే అసంతృప్తి ఉంది. ఆ లోటును గాడ్ ఫాదర్ తీరుస్తుంది.
గాడ్ ఫాదర్ తో పాటు దసరాకు విడుదలవుతున్న ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాలి’ అని చిరంజీవి చెప్పాడు. గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలను పోషించారు. అతిథిగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.