Telugu News  /  Entertainment  /  Chiranjeevi Salman Khan Godfather Movie Review
చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్
చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ (Twitter)

Godfather Movie Review: గాడ్‌ఫాద‌ర్ మూవీ రివ్యూ- రీమేక్ సినిమాతో చిరంజీవి హిట్ అందుకున్నాడా

05 October 2022, 11:54 ISTNelki Naresh Kumar
05 October 2022, 11:54 IST

Godfather Movie Review: టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi), బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్ (Salmankhan) తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం గాడ్‌ఫాద‌ర్ (Godfather Movie). మోహ‌న్‌లాల్ హీరోగా మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యాన్ని సాధించిన లూసిఫ‌ర్ (Lucifer Movie)ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

Godfather Movie Review: రీమేక్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి క‌లిసొచ్చాయి. గ‌తంలో వివిధ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన ప‌లు సినిమాల్ని తెలుగులో రీమెక్ చేసి క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అందుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్ట్రెయిట్ సినిమాల‌కంటే రీమేక్ క‌థ‌ల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తున్నారు చిరంజీవి. ఆయ‌న హీరోగా న‌టించిన తాజా చిత్రం గాడ్‌ఫాద‌ర్‌.

ట్రెండింగ్ వార్తలు

మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన లూసిఫ‌ర్ ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమా తెర‌కెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. న‌య‌న‌తార(Nayanthara), స‌త్య‌దేవ్ (Satyadev)కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మోహ‌న్‌రాజా(Mohanraja) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ద‌స‌రా రోజున ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రీమేక్ క‌థ చిరంజీవికి స‌క్సెస్‌ను తెచ్చిపెట్టిందా? చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ అభిమానుల‌ను అల‌రించారా? నాగార్జున‌తో తొలిసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డిన‌ చిరంజీవికి ఎలాంటి ఫ‌లితం ఎదురైంది? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే.

God father movie story: గాడ్‌ఫాద‌ర్ క‌థ‌..

ముఖ్య‌మంత్రి పీకే రామ్‌దాస్ (స‌ర్వ‌ధామ‌న్ బెన‌ర్జీ) హ‌ఠాన్మ‌ర‌ణంతో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రంగా అస్థిర‌త ఏర్ప‌డుతుంది. రామ్‌దాస్ త‌ర్వాత సీఏం స్థానాన్ని అదిష్టించేందుకు రామ్‌దాస్ అల్లుడు జ‌య్‌దేవ్ (స‌త్య‌దేవ్‌) ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. డ్ర‌గ్ మాఫియాతో చేతులు క‌లుపుతాడు. వారి ద్వారా రాష్ట్రం మొత్తాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ప‌థ‌కాలు వేస్తుంటాడు. అత‌డి ప్ర‌య‌త్నాల్ని రామ్‌దాస్ కొడుకు బ్ర‌హ్మ (చిరంజీవి) అడ్డుకుంటుంటాడు. మ‌రోవైపు బ్ర‌హ్మ‌ను రామ్‌దాస్ కూతురు స‌త్య‌ప్రియ (న‌య‌న‌తార‌) ద్వేషిస్తుంటుంది. చివ‌ర‌కు తండ్రికి అత‌డు త‌ల‌కొరివి పెట్ట‌డానికి కూడా అంగీక‌రించ‌దు.

త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు బ్ర‌హ్మ అడ్డురావ‌డం స‌హించ‌లేని జ‌య్‌దేవ్ అత‌డిపై త‌ప్పుడు కేసుల‌ను బ‌నాయించి జైలు పాలు చేస్తాడు. ఆ కేసు నుంచి బ్ర‌హ్మ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? జ‌య‌దేవ్ ఆరాచ‌కాల్ని ఏ విధంగా అడ్డుకున్నాడు? బ్ర‌హ్మను స‌త్య ద్వేషించ‌డానికి కార‌ణ‌మేమిటి? అత‌డి మంచిత‌నాన్ని ఆమె గుర్తించిందా? జ‌య‌దేవ్ కుట్ర‌ల నుంచి స‌త్య‌ప్రియ‌తో పాటు ఆమె సోద‌రి జాన్వీల‌ను (తాన్య ర‌విచంద్ర‌న్) బ్ర‌హ్మ ఏ విధంగా కాపాడాడు? ఇంట‌ర్‌పోల్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌ ఖురేషికి బ్ర‌హ్మ‌కు ఉన్న సంబంధం ఏమిటి? బ్ర‌హ్మ క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తిసారి అత‌డిని కాపాడుతున్న మ‌సూమ్‌ఖాన్ (స‌ల్మాన్‌ఖాన్‌) ఎవ‌రు అన్న‌దే గాడ్‌ఫాద‌ర్ సినిమా క‌థ‌.

Megastar Image: చిరు ఇమేజ్‌ను న‌మ్మి...

పొలిటిక‌ల్‌ డ్రామాకు ఫ్యామిలీ, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి గాడ్‌ఫాద‌ర్ సినిమా రూపొందింది. చిరంజీవి ఇమేజ్‌పైనే ఆధార‌ప‌డి తెర‌కెక్కిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. అత‌డిలోని హీరోయిజాన్ని ప్ర‌తి సీన్‌లో ఎలివేట్ చేస్తూ మెగా అభిమానుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా గాడ్‌ఫాద‌ర్ సినిమాను రూపొందించారు. ప్ర‌జ‌ల‌ను కాపాడే బాధ్య‌త రాజుకు ఉంటుంది. కానీ రాజు కుటుంబానికే క‌ష్టాలు వ‌స్తే ఓ గాడ్‌ఫాద‌ర్ ఎలా ప‌రిష్క‌రించాడో ఈ సినిమాలో చూపించారు.

Remake of lucifer: రీమేక్ సినిమానే కానీ..

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ సినిమాకు రీమేక్ ఇది. లూసిఫ‌ర్‌లోని మూల‌క‌థ‌ను తీసుకొని గాడ్‌ఫాద‌ర్‌ను తెర‌కెక్కించారు. చిన్న చిన్న మార్పులు మిన‌హా మెయిన్ పాయింట్‌లో పెద్ద‌గా మార్పులు చేయ‌లేదు. మ‌ల‌యాళ సినిమా చాలా రియ‌లిస్టిక్‌గా సాగుతుంది. కానీ తెలుగులో గాడ్‌ఫాద‌ర్ సినిమాను పూర్తిగా క‌మ‌ర్షియ‌లైజ్ చేశారు ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా. ఆద్యంతం స్టైలిష్‌గా చిరంజీవి క్యారెక్ట‌ర్‌ను రూపొందించారు. చిరంజీవి నుంచి అభిమానులు ఎలాంటి డైలాగ్స్‌, మాస్ ఎలివేష‌న్స్, మేజ‌రిజ‌మ్స్ కోరుకుంటారో అవ‌న్నీ సినిమాలో ఉండేలా డిజైన్ చేసుకున్నారు.

చిరు, స‌త్య‌దేవ్ పోటాపోటీ

ఖురేషి అనే మోస్ట్ డేంజ‌ర‌స్ క్రిమిన‌ల్ కోసం అండ‌ర్‌వ‌ర‌ల్డ్ మొత్తం వెతుకుతున్న‌ట్లుగా చూపించే సీన్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ గాడ్‌ఫాద‌ర్ సినిమా మొద‌ల‌వుతుంది. సీఏం పీకేఆర్ మ‌ర‌ణించ‌డం, అత‌డి స్థానంలో ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం జ‌య‌దేవ్ ప్ర‌య‌త్నాల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్ న‌డుస్తుంది. స‌త్య‌దేవ్ వేసే ప్లాన్స్‌ను త‌నకున్న ప‌వ‌ర్‌తో చిరంజీవి ఎలా చిత్తు చేశాడ‌న్నది ట్విస్ట్‌ల‌తో అల్లుకున్నారు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ అంశాల‌తో సాగుతుంది. స‌త్య‌ప్రియ‌కు ఎదురైన క‌ష్టాల‌ను అన్న‌య్య‌గా బ్ర‌హ్మ ఎలా ప‌రిష్క‌రించాడో చూపించారు.

కాపీ పేస్ట్‌...

మ‌ల‌యాళం వెర్ష‌న్‌ను చాలా చోట్ల గాడ్‌ఫాదర్‌ మూవీలో య‌థాత‌థంగా ఫాలో అయ్యారు ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా. మాతృక‌లోని డైలాగ్స్‌, సీన్స్ కాపీ చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. అందులోని త‌ప్పుల్ని స‌రిదిద్దుకుంటూ బెట‌ర్‌గా రీమేక్ చేసే అవ‌కాశం ఉంది. కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా. చిరంజీవికి ధీటైన విల‌న్‌గా స‌త్య‌దేవ్‌ను చూపించాల‌ని అనుకున్నారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ స‌రిగా సెట్‌కాలేదు. ఇలాంటి పొలిటిక‌ల్ క‌థ‌ల‌తో చాలా సినిమాలొచ్చాయి. పాయింట్‌లో పెద్ద‌గా కొత్త‌ద‌నం ఏమీ లేదు. అన్నాచెల్లెళ్ల అనుబంధంలో సెంటిమెంట్ స‌రిగా పండ‌లేదు. పాట‌ల‌కు స‌రైన ప్లేస్‌మెంట్ కుద‌ర‌లేదు.

Chiranjeevi Dual Shade: చిరు డ్యూయ‌ల్ షేడ్‌

కుటుంబాన్ని, పార్టీని చ‌క్క‌దిద్ద‌డానికి ఆరాట‌ప‌డే బాధ్య‌త క‌లిగిన యువ‌కుడిగా, గాడ్‌ఫాద‌ర్ అనే మోస్ట్ డేంజ‌ర‌స్ క్రిమిన‌ల్‌గా భిన్న కోణాల్లో సాగే పాత్ర‌లో చిరంజీవి క‌నిపించాడు. సాల్ట్ పెప్ప‌ర్ లుక్‌లో కొత్త‌గా క‌నిపించాడు. ఇలాంటి పాత్ర‌లు చిరంజీవికి కొట్టిన పండి కావ‌డంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇంట్రెవ‌ల్‌కు ముందు స‌ల్మాన్‌ఖాన్ క్యారెక్ట‌ర్‌ను స్క్రీన్‌పై చూపించి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ మొత్తం స‌ల్మాన్ ఖాన్‌పైనే తెర‌కెక్కించారు. తార్ మార్ త‌క్క‌ర్ మార్ పాట‌లో చిరు, స‌ల్మాన్ వేసిన స్టెప్లులు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయి.

త‌న స్వార్థం కోసం ఎంత‌టికైనా తెగించే వ్య‌క్తిగా స‌త్య‌దేవ్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో న‌టించాడు. యాక్టింగ్‌లో ఇంటెన్స్ చూపించాడు. స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా ఎమోష‌న్స్ ప‌రంగా సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా న‌య‌న‌తార నిలిచింది. డైలాగ్స్ త‌క్కువే అయినా త‌న ఎక్స్‌ప్రేష‌న్స్‌తో ఆక‌ట్టుకున్న‌ది. సిరివెన్నెల హీరో స‌ర్వ‌ధామ‌న్ బెన‌ర్జీ చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాలో చిరంజీవి ఫాద‌ర్‌గా న‌టించాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని, సునీల్ క‌నిపించారు. దివి, ష‌షీ, ముర‌ళీశ‌ర్మ‌ల‌కు ఇంపార్టెంట్ రోల్స్ దొరికాయి.

త‌మ‌న్ బీజీఎమ్ ప్ల‌స్‌..

త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాడ్‌ఫాదర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌గా నిలిచింది. చిరులోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్‌లో త‌మ‌న్ బీజీఎమ్ ఆక‌ట్టుకుంటుంది. ల‌క్ష్మీభూపాల్ డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డ పేలాయి.

Mega fans: మెగా ఫ్యాన్స్‌ను మెప్పించే గాడ్‌ఫాదర్

గాడ్‌ఫాద‌ర్ మెగా అభిమానుల‌ను మెప్పించే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. లూసిఫ‌ర్ సినిమా చూడ‌ని వారిని మెప్పిస్తుంది. మ‌ల‌యాళ సినిమా చూసిన వారికి కిక్ ఇవ్వ‌క‌పోవ‌చ్చు.

రేటింగ్ : 3/5