YSRCP President : ఆ తీర్మానం తూచ్… అధ్యక్షుడు ఒప్పుకోలేదు….
YSRCP President వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని పార్ట అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో అమోదం పొందలేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. లక్షలాది మంది హాజరైన పార్టీ ప్లీనరీలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వేదిక మీద ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ పిల్లి మొగ్గ వేయాల్సి వచ్చింది.
YSRCP President వైఎస్సార్సీపీ జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జూలైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని వైకాపా నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడి అమోదం పొందక పోవడంతో తీర్మానం చెల్లనట్టేనని స్పష్టం చేశారు.
YSRCP President వైఎస్సార్సీపీకి జీవిత కాల అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటూ పార్టీ ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ఉపసంహరించుకుంది. ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి అమోదించకపోవడంతో ఆ తీర్మానం చెల్లుబాటు కాదని తేల్చారు. నిజానికి ప్లీనరీలో పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ తీర్మానాలు చేసినపుడు చాలా మందిలో సందేహాలు వచ్చినా ఎవరు దానిని ప్రశ్నించలేకపోయారు. పార్టీ ప్లీనరీ ముగింపు వేదికపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన రెండు తీర్మానాల్లో వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటున్నట్లు చేసిన తీర్మానం కూడా ఉంది.
అవగాహన లేకపోవడంతోనేనా…?
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుతో ఏర్పాటైన రాజకీయ పార్టీకి జీవిత కాల అధ్యక్షుడు ఉండటం సాధ్యం కాని పని. పార్టీ న్యాయవిభాగం ఏ మాత్రం ముందు చూపుతో ఉన్నా ఇలాంటి తీర్మానం చేసే పరిస్థితి వచ్చేది కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా ఎన్నికలపైనే ఆధార పడి నడిచే దేశంలో ఎన్నిక అన్నదే లేకుండా జీవిత కాలం అధ్యక్షుడి ఎన్నిక ఓ ప్రజాస్వామ్య పార్టీలో జరగని పని .
2011లో పార్టీ ఏర్పాటు సమయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా వైఎస్సార్ పార్టీని ఏర్పాటు చేయాలని భావించారు. రకరకాల కారణాలతో జగన్మోహన్ రెడ్డి దరఖాస్తులకు అమోదం లభించలేదు. దాదాపు ఏడెనిమిది సార్లు కొత్త పార్టీ ఏర్పాటు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అప్పటికే శివకుమార్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పార్టీ రాజ్యాంగాలకు రెండు సార్లు సవరణలు కూడా చేశారు. తొలుత పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్.విజయమ్మను ఎన్నుకున్నారు. ఆ తర్వాతి కాలంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి చేతికి వచ్చాయి. పార్టీ రాజ్యాంగంలోని 5వ పేరాలో సైతం ఐదేళ్లకోమారు ఎన్నిక నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని వైసీపీ రాజ్యాంగంలో రాసుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వాటి నిర్ణీత కాలవ్యవధిలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి హాజరైన వారిలో మూడింట రెండొంతుల మెజార్టీతో అధ్యక్షుడిని కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నుకున్న వారి జాబితాను ఎన్నిక జరిగినప్పటి నుంచి నెలలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఆగష్టులో వైసీపీ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ వివరాలను, ఎన్నుకున్న వారి జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. ప్లీనరీ సమయంలో ఎన్నిక జరిగి ఉంటే లక్షల మంది సంతకాలను ఆ పార్టీ సేకరించాల్సి ఉంటుంది. ఇవేమి పరిగణలోకి తీసుకోకపోవడంలో చట్టాలపై అవగాహన రాహిత్యమే కారణంగా కనిపిస్తోంది.
యూ టర్న్ పాలిటిక్స్. …
కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా లేఖ రాయడంతో వైఎస్సార్సీపీ నేతలు పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని సీఎం జగన్ తిరస్కరించారని ప్రకటించా. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని తమను కోరిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. వైకాపా జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉండాలని జూలైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనని, కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు వివరించారు. అయితే, ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నారు. న్యాయపరమైన పర్యావసనాలను ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత వాటి మీద వెనక్కి తగ్గడం వెనుక కొందరి అత్యుత్సాహం ఉంటుందని, ముఖ్యమంత్రిని కూడా వారు తప్పుదోవ పట్టిస్తు ఉండొచ్చనే అనుమానాలు ఆ పార్టీలో ఉన్నాయి.
ఐదేళ్ల తర్వాత ఎన్నికలు….
జగన్ శాశ్వత అధ్యక్షుడిగా నియామకం ప్లీనరీలో తీర్మానం ఆమోదం పొందలేదని, మినిట్స్‌లో కూడా లేదని వివరణ ఇస్తున్నారు. ఈసీకీ తాము ఏ తీర్మానాన్నీ పంపించలేదని చెప్పారు. జీవిత కాల అధ్యక్ష పదవి విషయమై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అడిగినందున, ప్రస్తుతం ఆ తీర్మానం అమల్లో లేదని ఈసీకి చెబుతామని సజ్జల చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం వైఎస్ జగనే వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారన్నారు. ఐదేళ్ల పాటు తమ పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా వైఎస్ జగన్ కొనసాగుతారంటూ.. అప్పట్లోనే ఈసీకి పంపామన్నారు. వైకాపాలో ఐదేళ్లకొకసారి పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా సజ్జల స్పష్టంచేశారు.