Telugu News  /  Andhra Pradesh  /  Youth Suicide Attempt In Tirupati District In Front Of Lovers House And Severely Injured With Burns
ప్రియురాలికి నిశ్చితార్థంతో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్ధి
ప్రియురాలికి నిశ్చితార్థంతో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్ధి

Youth Suicide : ప్రియురాలికి నిశ్చితార్థం… ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం….

06 February 2023, 9:58 ISTHT Telugu Desk
06 February 2023, 9:58 IST

Youth Suicide : ప్రేమించిన అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం జరగడం తట్టుకోలేకపోయాడు. మాట్లాడేందుకు ప్రయత్నించిన ముఖం చూపించకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ప్రియురాలు చేసిన పనితో మనస్తాపానికి గురై ఆమె ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

Youth Suicide ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ బాధతో ఓ యువకుడు శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో చోటుచేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

కోట మండలం చంద్రశేఖరపురం ఎస్టీ కాలనీకి చెందిన కొట్లపూడి తేజ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. ఓజిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ విషయం తెలియడంతో తేజ ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లాడు.

యువతి ఇంటికి వద్దకు వెళ్లి ఆమెను పిలిచినా ఆమె బయటకు రాకపోడంతో అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయాడు. రెండోసారి ఇంటి వద్దకు వచ్చిన యువకుడు, తన వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో స్థానికులు స్పందించి మంటలు అదుపుచేశారు. 108లో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఓజిలి ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి….

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది. కుమిలి గ్రామానికి చెందిన కుర్ని వెంకటేష్‌ రెల్లివలస నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గేదెల పైడినాయుడు కుమిలి నుంచి రెల్లివలస వెళ్తున్నారు. మార్గమధ్యలో వీరిద్దరూ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నారు. వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని వెంటనే సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. వెంకటేష్‌ పూసపాటిరేగలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు రాజీనాయుడు, అసిరమ్మ, ఓ సోదరుడు ఉన్నారు.

వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడ్ని చదివిస్తున్నారు. వ్యక్తిగత పనిపై బైక్‌తో వెళ్తుండగా మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పైడినాయుడు పూసపాటిరేగలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు రాజీనాయుడు, రాములమ్మ, అన్నయ్య ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సర్వజన ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

టాపిక్