Murder Mystery : ప్రియుడి మోజులో భర్త హత్య, దోపిడీ అంటూ నాటకం….-wife killed husband with the help of boy friend ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Wife Killed Husband With The Help Of Boy Friend

Murder Mystery : ప్రియుడి మోజులో భర్త హత్య, దోపిడీ అంటూ నాటకం….

HT Telugu Desk HT Telugu
Nov 05, 2022 06:29 AM IST

Murder Mystery కట్టుకున్న భర్త కంటే ప్రియుడిపై మోజు ఎక్కువైంది. భర్త మీద అసంతృప్తితో అడ్డు తొలగించుకునేందుకు దోపిడీ నాటకం ఆడింది. ఇంటికి వస్తున్న భర్తను ప్రియుడితో హత్య చేయించి, ఆపై దోపిడీ దొంగలు దాడి చేశారని నాటకాలాడింది. పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలి హత్య బయటపడింది.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Murder Mystery చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య నాటకం బయటపడింది. నాలుగు రోజుల క్రితం దోపిడీ దొంగలు బంగారం కోసం భర్తపై కత్తులతో దాడి చేశారని చెప్పిన ఘటనలో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. మృతుడి భార్య, మరొకరితో కలిసి హత్య చేయించినట్లు బయటపెట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని పెనుగొలకలకు చెందిన అనురాధకు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే దామోదర్‌తో వివాహమైంది. అక్టోబర్ 31న అనురాధ పుట్టింటి నుంచి వస్తుండగా దొంగలు దాడి చేసి ఉంగరాలు, గొలుసులు లాక్కున్నారని అడ్డొచ్చిన భర్తపై కత్తితో దాడి చేశారని విలపించింది. తీవ్రంగా గాయపడిన దామోదర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనురాధను అనుమానించారు.

దోపిడీ దొంగలు బంగారు ఉంగారాలు లాక్కున్నారని, అడ్డుకున్నందుకు భర్తపై దాడి చేశారని అనురాధ పోలీసులకు చెప్పింది. అదే సమయంలో ఆమె మెడలో భారీ బంగారు గొలుసులు రెండు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. నిందితురాలి కాల్ డేటా బయటకు తీయడంతో నేరం బయటపడింది. అదే గ్రామానికి చెందిన పాలవ్యాపారి గంగరాజుతో అనురాధ తరచుగా మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని విచారించడంతో హత్య విషయం బయటపడింది.

ఇంటర్ వరకు చదువుకున్న అనురాధకు కొద్ది నెలల క్రితం దామోదర్‌తో వివాహం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. భర్త మీద అసంతృప్తితో ఆటోలో పాల వ్యాపారం చేసే గంగరాజుకు అనురాధ దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన సంబంధంతో అనురాధ తన బంగారాన్ని గంగరాజుకు ఇచ్చింది. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టిన గంగరాజు జల్సాలు చేశాడు. ఈ క్రమంలో నగదు అవసరం కావడంతో భార్య నగలు కావాలని భర్త దామోదర్ అడిగాడు. పుట్టింట్లో ఉన్నాయని అబద్దం చెప్పిన అనురాధ, వెళ్లి తెచ్చుకుందామని నమ్మబలికింది. భార్య మాటలు నమ్మిన దామోదర్ ఆమెతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అక్టోబర్ 31న కావాలనే రాత్రి పొద్దుపోయే వరకు షాపింగ్ పేరుతో బయట తిప్పిన అనురాధ, చీకటి పడ్డాక భర్తతో కలిసి ఇంటికి బయల్దేరింది. తాము ఎక్కడ ఉన్నామో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ప్రియుడికి సమాచారం ఇచ్చింది.

నిర్మానుష్య ప్రదేశంలో పథకం ప్రకారం భర్తపై దాడి చేయించింది. ఆ తర్వాత తనకు తాను స్వల్ప గాయాలు చేసుకుని నాటకం మొదలుపెట్టింది. ఘటనా స్థలంలోనే ఆమె తీరు అనుమానించిన పోలీసులు కాల్ డేటా బయటకు తీయడంతో అనురాధ వ్యవహారం వెలుగు చూసింది. ప్రియుడికి ఇచ్చిన బంగారం విషయం బయటకు తెలిసి పోతుందనే భయంతో ఏకంగా హత్యకు ప్లాన్ చేసి దొరికిపోయింది. భార్యను అమాయకంగా నమ్మి భర్త దామోదర్ ప్రాణాలు కోల్పోయాడని పలమనేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్