తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం(Bay Of Bengal)లో కొనసాగుతున్న అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనించనుంది. గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. ఆ తర్వాత.. ఆ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదలనుంది. శ్రీలంక(Sri Lanka) మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగా ఉండనుందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.,అయితే దీని ప్రభావంతో మాత్రం.. రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని, పెద్దగా ప్రభావం ఉండదని వెల్లడించారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ(Rayalaseema)లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావం ఈ నెల 28వ తేదీ వరకూ ఉంటుందని.. వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ ప్రభావం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.,ఇంకోవైపు.. రాష్ట్రానికి ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా పొగమంచు కమ్ముకుంటోంది. ఉష్ణోగ్రతలు(Temperature) కూడా పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ(IMD) ప్రకటించింది.,,