CBN Posters : చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు… వైసీపీ వ్యూహం అదేనా…
CBN Posters ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు తారా స్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్‌కు అవమానం జరిగిందని టీడీపీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది టీడీపీయేనంటూ వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబుకు వ్యతిరేకంగా విజయవాడ నగరమంతటా పోస్టర్లు వెలిశాయి.
CBN Posters ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో వైసీపీ, టీడీపీలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్ మాకు అవసరం లేదంటూ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు పోస్టర్లుగా నగరమంతటా వెలిశాయి.
ట్రెండింగ్ వార్తలు
CBN Posters హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో ఎన్టీఆర్‌ను వైఎస్సార్సీపీ అవమానించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరును ఏకపక్షంగా మార్చేశారని ఆరోపిస్తూ గత వారం రోజులుగా టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ అవసరం మాకు లేదంటూ ప్రకటించారు. ఇప్పుడు వాటిని పోస్టర్లుగా మార్చి విజయవాడ అంతటా అంటించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో టీడీపీ వర్గం నుంచి వైసీపీ కోరుకున్న స్పందన రావడంతో CBN Postersను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. పోస్టర్ల వెనుక ఎవరున్నారో తెలియకపోయినా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరును చర్చగా మార్చడంలో వైసీపీ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
విజయవాడలో నందమూరి తారకరామరావు స్థాపించిన హెల్త్ యూనివర్శిటీకి ఆయన మరణానంతరం ఎన్టీఆర్ పేరు పెట్టారు. రాష్ట్రంలో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటుకు ముందు ఎంబిబిఎస్ కోర్సులు కూడా మిగిలిన యూనివర్శిటీ కోర్సుల్లో భాగంగానే ఉండేవి. దేశంలోనే తొలిసారి వైద్య విద్య కోసం విజయవాడలో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినపుడు దానికి కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ వినిపించినా ఎన్టీఆర్ దానిని పట్టించుకోలేదనే వాదనలు తాజాగా CBN Posters రూపంలో తెరపైకి వచ్చాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం వెనుక వైఎస్సార్సీపీ రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని సరిగా అర్ధం చేసుకోలేక టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను తమ సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఇదే అదనుగా గతంలో ఆయనకు జరిగిన అవమానాలను వైసీపీ తెరపైకి తీసుకువస్తోంది. దీని వల్ల టీడీపీ అభిమానులతో పాటు ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటలనలు కూడా మళ్లీ CBN Posters ద్వారా చర్చకువస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మూడో తరం వచ్చేసింది. వారిలో చాలామందికి ఎన్టీఆర్ విషయంలో ఏమి జరిగిందనేది సరిగా తెలియదు. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలు, అధికార మార్పిడి వ్యవహారం, చంద్రబాబు పాత్ర వంటివి ప్రస్తుత తరాలకు తెలియదు. యూనివర్శిటీ పేరు మార్పుతో ప్రభుత్వానికి జరిగే నష్టం కంటే, పాత విషయాలన్ని మళ్లీ కొత్తగా చర్చకు రావడమే వైసీపీ కోరుకున్నట్లు కనిపిస్తోంది. దీని వల్ల అసలైన టీడీపీ వారసులు ఎవరు అనే అంశాన్ని తెరపైకి తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్పు వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగే నష్టం కంటే ప్రత్యర్ధులకు జరిగే నష్టంపైనే అధికార పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడలో We dont want NTR అనే పాత పేపర్ క్లిప్పింగ్స్ పోస్టర్లుగా వెలిసినట్లు తెలుస్తోంది.