Visakha Sarada Peetham :పార్టీలు కోరితేనే ప్రత్యేక యాగాలు చేస్తామన్న స్వాత్మానంద
Visakha Sarada Peetham విశాఖ శారదా పీఠానికి రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధం లేదని స్వామి స్వాత్మానంద తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలతో తరచూ వార్తల్లో నిలిచే పీఠానికి పార్టీలతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని చిన్న స్వామి చెప్పారు.
Visakha Sarada Peetham విశాఖ శారదా పీఠానికి ఎలాంటి రాజకీయ పార్టీలతో అనుబంధాలులేవని, ఒక రాజకీయపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలలో తాము ఎవ్వరికీ వత్తాసు పలకడం లేదని స్వాత్మానంద స్పష్టం చేవారు. స్వామి స్వరూపానందకు చెందిన విశాఖ శారదా పీఠానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు శారదా పీఠం అనుగ్రహం, ఆశీర్వాదాల కోసం పరుగులు తీస్తుంటారు. ఏపీలో స్వామి స్వరూపానంద తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేశాయి. ఈ నేపథ్యంలో పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర వివరణ ఇచ్చారు.
హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలోని షాబాద్‌లో గుమ్తి ఆశ్రమం ఆధ్వర్యంలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని ముగించినట్లు ఢిల్లీలో మీడియాకు వివరించారు. హర్యానాలో నిర్వహించిన యజ్ఞం ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలను ఆశించి చేయలేదని స్పష్టం చేశారు. శారదా పీఠంపై మొదటి నుంచి కొందరు ఉద్దేశ పూర్వకంగా రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో శారదా పీఠం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందుకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు సహకారం అందిస్తున్నారని వివరించారు. రాజకీయ నాయకులు ఆశ్రమానికి రావడం మాత్రమే మీడియాను ప్రత్యేకంగా ఆకర్షిస్తోందన్నారు.
గతంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర నిర్వహించిన రాజశ్యామల యాగం వల్ల ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం ఉందని, ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఏవైనా పార్టీలు రాజశ్యామల యాగం కోసం శారదా పీఠాన్ని ఆశ్రయించారా అని ప్రశ్నిస్తే ''ఎవరైనా శారదా పీఠాన్ని ఆశ్రయిస్తే యాగాలు చేస్తామని, తమంతట తాము ఒక పార్టీకో, వ్యక్తికో అధికారం రావాలని ఎప్పుడూ ఎలాంటి యాగాలు చేయలేదన్నారు. అలా ఎప్పుడు చేయబోమన్నారు. ఉత్తర భారత దేశంలో కార్యకలాపాలు విస్తరించడానికి దిల్లీలో శారదా పీఠం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.