TTD Annual Budget: రూ4,411 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌..పెరిగిన స్వామి ఆదాయం-ttd approved annual budget with 4 411crores for current financial year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Approved Annual Budget With 4,411crores For Current Financial Year

TTD Annual Budget: రూ4,411 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌..పెరిగిన స్వామి ఆదాయం

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 12:28 PM IST

TTD Annual Budget: రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్‌కు అమోదం లభించింది.గత నెలలోనే బడ్జెట్‌కు అమోదం పలికినా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివరాలు వెల్లడించలేదు. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD Annual Budget: టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి అమోదం తెలిపింది. ఉగాది సందర్భంగా బడ్జెట్‌ వివరాలను ఛైర్మన్ వెల్లడించారు. తిరుమలలో వర్చువల్ సేవలను కొనసాగిస్తామని, వేసవిలో మూడు నెలలు విఐపి రెఫరల్స్ లెటర్లు తగ్గించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తుల దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా కుదిస్తామని తెలిపారు.

2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎ వి ధర్మారెడ్డి తో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్, స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి నెల 15వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించామని, కోడ్ నేపథ్యంలో తాజాగా వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు.

వి ఐ పి బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈ విధానాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవని, కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగిందన్నారు. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయని చెప్పారు.

భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్ లో జారీ చేశామని, తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించామన్నారు.

తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.

అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశామని తెలిపారు. . ఏప్రిల్ 5వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని సుబ్బారెడ్డి తెలిపారు.

వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వి ఐ పి ల రెఫరల్స్ బాగా తగ్గించాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల లో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించామన్నారు.

తిరుపతి లోని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశామన్నారు.

శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

IPL_Entry_Point