Tirumala Rush: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు-tirumala girulu is crowded with devotees due to summer vacations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Rush: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు

Tirumala Rush: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు

HT Telugu Desk HT Telugu
May 19, 2023 09:28 AM IST

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala Rush: భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతోంది. వేసవి ఎండల్ని లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు తరలి వస్తున్నారు. ఇంటర్‌, టెంత్‌ ఫలితాలు విడుదల కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. వేసవి సెలవులు మొదలైన తర్వాత మే రెండో వారం నుంచి తిరుమలకు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గురువారం 66,820 భక్తులు స్వామి వారిని దర్శింకున్నారు. 36,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 3.29కోట్ల రుపాయల హుండీ ఆదాయం లభించింది.

గురువారం శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు భారీగా వేచి ఉండాల్సి వచ్చింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని శిలాతోరణం దాకా దాదాపు రెండు కిలోమీటర్లు పొడవున బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తుల సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో మధ్యాహ్నం గంటకు పైగా వర్షం కురవడంతో రహదారులు, శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది. బుధవారం శ్రీవారిని 79,207 మంది భక్తులు దర్శించుకున్నారు. గురువారం ఆ సంఖ్య కాస్త తగ్గినా హుండీ ఆదాయం రూ.3.19 కోట్ల నుంచి రూ.3.29కోట్లకు పెరిగింది.

తిరుమలలో అక్రమంగా లడ్డూల తరలింపు…

తిరుమలలో అక్రమంగా తరలిస్తున్న లడ్డూ ట్రేలను విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. శ్రీవారి పోటులో తయారుచేసిన లడ్డూలను బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు నుంచి బూందీపోటులోకి లడ్డూలను ట్రేలలో కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా పంపారు. అక్కడి నుంచి లడ్డూ విక్రయ కేంద్రానికి ట్రేలను ట్రాలీల్లో సిబ్బంది తరలించి, వారికి ఇచ్చిన కౌంటర్లలో చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్లలోకి ఇవ్వాల్సిన ట్రేల కంటే అదనంగా 10-15 ట్రేలలో లడ్డూలు వచ్చినట్లు టీటీడీ విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లో గుర్తించింది.

ఒక ట్రేలో 50 లడ్డూలు ఉంటాయి. ఈ లెక్కలో 750 లడ్డూలు దాదాపు రూ.35 వేలకు పైగా విలువైన లడ్డూలను తనిఖీలు లేకుండా శ్రీవారి ఆలయం నుంచి నేరుగా లడ్డూ కౌంటర్లకు చేరాయి.మూడు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆలయ పోటులో పనిచేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

IPL_Entry_Point