Heat Waves In AP: ఏప్రిల్‌లోనే మండిపోతున్న ఉష్ణోగ్రతలు…. మరికొన్ని రోజులింతే…-the disaster management agency has announced that the summer temperatures will rise in ap for few more days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Heat Waves In Ap: ఏప్రిల్‌లోనే మండిపోతున్న ఉష్ణోగ్రతలు…. మరికొన్ని రోజులింతే…

Heat Waves In AP: ఏప్రిల్‌లోనే మండిపోతున్న ఉష్ణోగ్రతలు…. మరికొన్ని రోజులింతే…

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 09:46 AM IST

Heat Waves In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండి పోతున్నాయి. మే నెల రాకముందే ఉష్ణోగ్రత్తలు పెరుగుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.

వేసవి ఉష్ణోగ్రత తట్టుకోలేక చిన్నారులపై వస్త్రం కప్పి స్కూల్‌ నుంచి  తీసుకెళుతున్న తల్లి
వేసవి ఉష్ణోగ్రత తట్టుకోలేక చిన్నారులపై వస్త్రం కప్పి స్కూల్‌ నుంచి తీసుకెళుతున్న తల్లి ( Sai Saswat Mishra)

Heat Waves In AP: ఆంధ్రప్రదేశ్‌లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత మరింత పెరగనుందని ప్రకటించింది. మంగళవారం 26 మండలాల్లో, బుధవారం 69 మండలాల్లో వేడి గాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణశాఖ అంచనా వేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరుకోవచ్చని సంస్థ ఎండీ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రాపురం మండలాలు, అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, సీతానగరం, గోకవరం, కోరుకొండ మండలాలు, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం, కాకినాడ జిల్లాలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, జియమ్మవలస, కొమరాడ, వీరఘట్టం మండలాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగతాయని అంచనా వేశారు.

బుధవారం కూడా పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. విజయనగరం జిల్లాలోని 13 మండలాలు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 9 మండలాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 9మండలాలు, అనకాపల్లి 8 మండలాలు, మన్యం జిల్లాలో 7 మండలాలు, తూర్పుగోదావరి 6 మండలాలు, కాకినాడ 4, ఏలూరు 3, గుంటూరు 3, శ్రీకాకుళం 2, అల్లూరి జిల్లా 2, విశాఖ 1, కృష్ణా 1, నంద్యాల 1 మండలంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కానుంది.

మరోవైపు వచ్చే నైరుతి సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేస్తోంది. రానున్న నైరుతి సీజన్‌లో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్కైమెట్‌ అంచనా వేసింది. ఈ ప్రభావం ఉత్తర, మధ్య భారతాల్లో వ్యవసాయ రంగంపై పడుతుందని, ప్రధానంగా సీజన్‌లో చివరి రెండు నెలల్లో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలపై సోమవారం ఈ సంస్థ బులెటిన్‌ విడుదల చేసింది. రానున్న నెలల్లో ఎల్‌నినో ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని ప్రకటించింది. .

రాష్ట్రంలో సోమవారం అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. ప్రధానంగా పడమర గాలులతో కోస్తా మండిపోయింది. వేసవి సీజన్‌లో తొలిసారిగా కోస్తాలోని తునిలో 40.1, నందిగామలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో కర్నూలులో 41.1, అనంతపురం, నంద్యాలలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఎండలు మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

IPL_Entry_Point