Polavaram Funds: పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సింది రూ.1249కోట్లేనంటోన్న కేంద్రం..-the central government says that the funds for the polavaram project are limited ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Funds: పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సింది రూ.1249కోట్లేనంటోన్న కేంద్రం..

Polavaram Funds: పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సింది రూ.1249కోట్లేనంటోన్న కేంద్రం..

HT Telugu Desk HT Telugu
May 03, 2023 05:57 AM IST

Polavaram Funds: జాతీయ ప్రాజెక్టుగా హోదా లభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రూ.1249కోట్లు మాత్రమేనని కేంద్రం తేల్చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుండగా పెండింగ్‌లో ఉన్న నిధులపై ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు (twitter)

Polavaram Funds: ఓ వైపు మరమ్మతులు, ధ్వంసమైన డయాఫ్రం వాల్ పునర్నిర్మాణం, ఎర్త్‌ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం కోసం విడుదల కావాల్సిన నిధుల్లో ఇంకా రూ.1249కోట్లు మాత్రమే బాకీ ఉందనికేంద్ర జలసంఘం తేల్చేసింది.

ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు ఈ మేరకు సమాచారాన్ని పంపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు రూ. 1,249 కోట్లేనని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. "పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం ఇంకా ఎన్ని నిధులివ్వాలి? ప్రాజెక్టుకు రావాల్సిన తుది నిధులెన్ని? అంటూ విశాఖపట్నంకు చెందిన వి.రమేశ్‌చంద్ర వర్మ సమాచారహక్కు చట్టం కింద కేంద్రాన్ని ప్రశ్నించారు.

కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు సీడబ్ల్యూసీకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.1,249 కోట్ల రుపాయలను ఏపీకి ఇవ్వాల్సి ఉందని సమాధానమిచ్చారు. కేంద్ర ఆర్థికశాఖ సమాచారం ప్రకారం 2014 ఏప్రిల్ 1నాటికి ప్రాజెక్టు నిర్మాణంలో సాగునీటి విభాగం కింద చేసే ఖర్చును ఏపీకి కేంద్రం తిరిగి చెల్లించనుందని పేర్కొన్నారు.

2017-18 ధరల ప్రకారం ఇంకా రూ.28 వేల కోట్ల రుపాయలు ఖర్చు చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుంది. రకరకాల కారణాలతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. ప్రధాన డ్యాంతో పాటు ఎడమ కాలువ, ఇతర పనుల్లో జాప్యం జరుగుతోంది. నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ ధరల భారమూ పెరుగుతుంది. పోలవరం కొత్త డీపీఆర్‌కు కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలను అమోదించాలని ముఖ్యమంత్రి కోరుతున్నా ఫలితం మాత్రం ఉండట్లేదు.

పోలవరం ప్రాజెక్టు రూ. 47,725 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని పదేపదే కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచన మేరకు 2019కు ముందే అప్పటి ప్రభుత్వం రూ.55 వేల కోట్ల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2017-18 ధరలతో డీపీఆర్‌ 2 కేంద్రానికి సమర్పించింది. ఆ డీపీఆర్‌కు కేంద్ర జలసంఘంలోని సాంకేతిక సలహా మండలి ఆమోదించాల్సి ఉంది.

అప్పట్లో డిపిఆర్‌‌పై అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. ఎన్నో సందేహాలు వ్యక్తంచేశారు. ఆ వివరాల్నీ కేంద్ర జలసంఘానికి ఏపీ జలవనరుల శాఖ అధికారులు అందించారు. వేల పేజీల సమాధానాలు పంపారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యాలయంలో కూర్చుని ఒక బృందం సమాధానాలిచ్చి వచ్చింది. ఆ ప్రక్రియ తర్వాత కేంద్ర జలసంఘంలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం డీపీఆర్‌ను దాదాపు రూ.55,548.87 కోట్లకు ఆమోదించింది. 2019 ఫిబ్రవరిలోనే ఆ మేరకు కొత్త ధరలతో నిధులిచ్చేందుకు ఆమోదించింది.

డిపిఆర్‌ 2కుఅమోదం లభించిన తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ అంశాన్ని రివైజ్డు కాస్ట్‌ కమిటీకి అప్పగించింది. ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 47,725 కోట్లకు ఆమోదం తెలిపారు. కీలక దశలు ఇప్పటికే పూర్తి కావడంతో కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించి కేంద్ర మంత్రిమండలి ఆమోదం దక్కించుకోవడం మిగిలిఉంది. ఈ సమయంలో డీపీఆర్‌ను మళ్లీ పోలవరం అథారిటీకి వెనక్కు పంపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్ద రెండేళ్లుగా ఆ డీపీఆర్‌ పెండింగులోనే ఉంది. దీంతో ప్రాజెక్టు భవితవ్యం మొత్తం ప్రశ్నార్థకంగా మారింది.

IPL_Entry_Point