Supreme Court On Amaravati :అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ
Supreme Court On Amaravati అమరావతి పిటిషన్లపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ముందుగా నిర‌్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 28న కేసు విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది.
Supreme Court On Amaravati ఆంధ‌్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో నిరాశ తప్పలేదు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు సుప్రీం కోర్టు బెంచ్ ఎదుట విచారణకు రావడానికి సాంకేతిక అవంతరాలు ఎదురు కావడంతో త్వరితగతిన విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మార్చి 28న విచారిస్తామని గత వారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కేసు ప్రాధాన్యత దృష్ట్యా అత్యవసర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరోసారి ప్రస్తావించింది. అమరావతిని కొనసాగించే విషయంలో గతంలో ఇచ్చిన తీర్పుపై మరోమారు విచారణ చేపట్టాలని ప్రస్తావించారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా రెండోసారి ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
ఈనెల 28న అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ఇప్పటికే ప్రకటించింది. కేసు విచారణను గత సోమవారం ధర్మాసనం వద్ద ప్రస్తావించడంతో విచారణ తేదీ ఇచ్చిన బెంచ్ ప్రకటించింది. మార్చి 28వరకు వేచి ఉండలేని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. ప్రతివాదులైన రైతులు, ఇతరుల తరఫు లాయర్లకు ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్లు సమాచారం అందించారు.
గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. మరోవైపు 28వ తేదీ ఒక్కటే వాదనలకు సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు.
అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. కేసు విచారణ చేపడితే సార్థకత ఉండాలని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. కేసు విచారణలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం దానికి నిరాకరించింది.
అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. అయితే కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు.
విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించడానికి ముందే న్యాయపరమైన చిక్కుల్ని తొలగించుకోవవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కోర్టులో క్లియరెన్స్ లభిస్తే చట్ట బద్దంగా విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం ఆశించిన ఊరట లభిస్తుందో లేదోననే ఉత్కంఠ నెలకొంది