SEB : మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం….-seb registered hundreds of cases for illegal liquor transportation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Seb Registered Hundreds Of Cases For Illegal Liquor Transportation

SEB : మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం….

B.S.Chandra HT Telugu
Aug 06, 2022 01:39 PM IST

ఏపీలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. రాష్ట్రంలో మద్యం ధరల ప్రభావంతో పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యం రవాణా జరుగుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ పెరగడంతో వాటిని అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఏపీలో భారీగా అక్రమ మద్యం రవాణా కేసులు
ఏపీలో భారీగా అక్రమ మద్యం రవాణా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ యంత్రాంగానికి అక్రమ మద్యం రవాణా పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలో మద్యం ధరల ప్రభావంతో పాటు, బ్రాండ్ల లభ్యత, ఇతరత్రా కారణాలతో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం ఏపీలోకి ప్రవేశిస్తోంది. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం, ఇసుక, మట్టి, మైనింగ్ అక్రమాలను నిరోధించడానికి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దులున్న ఏపీకి ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, గోవా ప్రాంతాల నుంచి భారీగా మద్యం రవాణా అవుతోంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వ్యాపారం చేసుకునే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నిరంతరం తనిఖీలలో భారీగా మద్యం పట్టుబడుతూనే ఉంది. ఒక్కో జిల్లాలో రెండు కోట్ల రుపాయలకు తక్కువ విలువ కాకుండా మద్యాన్ని ఇటీవల పోలీసులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు ఏపీ పోలీసులు ప్రకటించారు.

అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి సిసి కెమెరాలు, మొబైల్ చెక్‌ పోస్టులు, ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అక్రమ రవాణాను అడ్డుకుంటున్నట్లు పోలీసు శాఖ చెబుతోంది.

జులై 29 నుంచి ఆగష్టు నాలుగు వరకు వారం రోజుల వ్యవధిలో 235 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 270మంది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు 2,110లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 16,590 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 622 లీటర్ల కల్తీ మద్యం, 181 లీటర్ల మద్యం, 610 కేజీల నల్లబెల్లం నిల్వల్ని ధ్వంసం చేశారు. వీటితో పాటు 1369 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 18కేసులు నమోదు చేశారు. 52మందిని గంజాయి రవాణా కేసుల్లో అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం రవాణా కేసుల్లో మొత్తం 322మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 262 మందిని బైండోవర్ చేసినట్లు ప్రకటించారు.

ప్రతి వారం పెద్ద ఎత్తున అరెస్టులు, కేసులు నమోదవుతున్నా ఏపీలో అక్రమ రవాణా, నాటుసారా తయారీకి సంబంధించిన కేసులు మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. సమస్య ఒకటుంటే పోలీసులు మరో మార్గంలో పరిష్కారం వెదుకుతున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.

IPL_Entry_Point

టాపిక్