YSRCP : ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించరు, పోరాడరెందుకు...?-public discussion over ysrcp mps performance in delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించరు, పోరాడరెందుకు...?

YSRCP : ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించరు, పోరాడరెందుకు...?

HT Telugu Desk HT Telugu
Jul 30, 2022 11:07 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పడి జరిగి మూడేళ్లు దాటి పోయింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమాన్ని ప్రజలకు అందించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. మ్యానిఫెస్టో సంగతి అటుంచితే ప్రజలు ఓట్లేసి గెలిపించిన పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్రశ్నించకపోవడంపై చర్చ
పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్రశ్నించకపోవడంపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మరోమారు అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామని, ప్రకటించన హామీలను కూడా ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అదే సమయంలో ఏపీకి కీలకమైన విషయాల్లో మాత్రం ఎలాంటి పురోగతి సాధించలేక పోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. తమకు అవకాశమిస్తే, పార్లమెంటు స్థానాలన్నింటిలో వైసీపీ అభ్యర్ధుల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హామీలను సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. ఆయన కోరుకున్నట్లే ఏపీలో 25ఎంపీ స్థానాల్లో 22చోట్ల ఆ పార్టీ అభ్యర్ధులు గెలుపొందారు. టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఒకరు పార్టీపై తిరుగుబాటు ప్రకటించి పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్‌సభలో 21మంది సభ్యుల బలం ఉంది. మూడు ఏళ్ల మూడు నెలలుగా ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఏం సాధించారనేది వెనక్కి తిరిగి చూస్తే చెప్పుకోడానికి పెద్దగా ఏమి మిగల్లేదు.

ఏపీలో ఉన్న అధికార పార్టీ ఎంపీల పేర్లు అడిగితే, వెంటనే గుర్తు తెచ్చుకోవడం కూడా కష్టమే. చాలామంది ప్రజలకు గుర్తు లేకుండానే తమ పదవీ కాలాన్ని ముగించేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి మినహా మిగిలిన ఎంపీలు ఏం చేస్తున్నారో, ఏం సాధించారో ఎవరికి తెలియదు. తమ నియోజక వర్గాలకు తమ రాష్ట్రానికి కలిసికట్టుగా సాధించిన ప్రయోజనం ఏమైనా ఉందో లేదో తెలీదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉన్న ప్రధాన డిమాండ్లలో ప్రత్యేక క్యాటగిరీ గుర్తింపు కోసం ఎనిమిదేళ్లుగా డిమాండ్‌ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా చెబుతున్నా, రాజకీయ పార్టీలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి.

ఏపీలో పారిశ్రామీకీకరణ, పెట్టుబడుల రాక వంటి విషయాల్లో ఆసక్తి వ్యక్తం చేయకపోవడానికి ప్రత్యేక హోదా లేకపోవడం ఓ అడ్డంకిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21 మంది ఎంపీలు అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి డిమాండ్లను కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం కూడా రాష్ట్ర ఎంపీలు చేయకపోవడం ప్రజల్లో అనుమానాలకు కారణమవుతోంది.

పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తారని భావించినా అదిజరిగేలా కనిపించడం లేదు. బీజేపీకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఏపీ వ్యవహరిస్తోంది. రాష్ట్రాల సమస్యలు, డిమాండ్ల విషయంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ ఎంపీల వ్యవహారం సాగుతోంది. కేంద్రంలో బీజేపీకి పూర్తిగా బలం ఉన్నందున తాము పోరాడినా ప్రయోజనం ఉండదని, వారితో సామరస్యంగా మెలగడం ద్వారానే సాధించుకోగలమని నమ్మ బలుకుతున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు ఇలా ఏ విషయంలోను దూకుడు ప్రదర్శించడం లేదు. కేంద్రంతో కొట్లాడకపోయినా పార్లమెంటులో గట్టిగా నిలదీయకపోవడాన్ని సామాన్య ప్రజలు సైతం తప్పు పడుతున్నారు. మెజార్టీ ఎంపీలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు కూడా చేయలేకపోతున్నారు. తమ నియోజక వర్గాలకు కావాల్సిన డిమాండ్ల విషయంలో పార్లమెంటులో గళమెత్తలేకపోతున్నారు. ఒకరిద్దరు ఎంపీలు మినహా మిగిలిన వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదని, పిలిస్తే వెళ్లాం, పనయ్యాక వచ్చాం అన్నట్లు వారి వ్యవహారం సాగుతోందనే విమర్శలున్నాయి. బీజేపీతో వైసీపీకి ఢిల్లీలో దోస్తీ, ఏపీలో కుస్తీ మాదిరి సాగుతుందనే వారు లేకపోలేదు.

IPL_Entry_Point

టాపిక్