Polavaram: జులైలోనే పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు..!-polavaram preojects earth cum rock fill dam works will start in july 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Polavaram Preojects Earth Cum Rock Fill Dam Works Will Start In July 2023

Polavaram: జులైలోనే పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు..!

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 01:27 PM IST

Polavaram: డయాఫ్రం వాల్‌ దెబ్బ తినడంతో ఆలశ్యమవుతున్న పోలవరం ఆనకట్ట నిర్మాణాన్ని జులైలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణసంస్థతో పాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్, హై పవర్ కమిటీలు ఆనకట్ట నిర్మాణానికి ముహుర్తం ఖరారు చేశాయి.

జులైలో ప్రారంభం కానున్న పోలవరం మట్టికట్ట నిర్మాణం
జులైలో ప్రారంభం కానున్న పోలవరం మట్టికట్ట నిర్మాణం

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్ డ్యామ్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ తాజా డిజైన్లకు అమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో జులైలో పనులు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో వరుసగా రెండు సీజన్లలో పనులు నిలిచిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు గోదావరి వరద ప్రవాహంతో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపే పనులు పూర్తి చేసే పనులు ప్రారంభించనున్నారు. డయాఫ్రం వాల్ నిర్మించిన ప్రాంతంలో పెద్దఎత్తున అగాథాలు ఏర్పడటంతో వాటిలో ఇసుక నింపి దానిని వైబ్రో కాంపషన్ పద్ధతిలో గట్టి పరిచే పనులు చేపట్టనున్నారు. గోదావరి వరదల్లో డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిన చోట పెద్ద ఎత్తున ఏర్పడిన అగాథాలను వేగంగా పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిపుణులు డయాఫ్రం వాల్ సామర్థ్యంపై ఇప్పటికే నివేదిక సమర్పించడంతో దానికి అనుగుణంగా పనులు చేపట్టనున్నారు.

1400మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రం వాల్‌లో దాదాపు 700మీటర్ల పొడవున వేర్వేరు ప్రాంతాల్లో దెబ్బతింది. వీటిని సరిచేయాల్సి ఉందని గుర్తించారు. రెండు భాగాలుగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో వాటిని సరిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాల్లో డి వాల్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. కోతకు గురైన రెండు భాగాల్లో డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా డి వాల్ నిర్మాణం చేపడతారు.

ఆనకట్ట నిర్మాణానికి సన్నద్ధం…

డయాఫ్రం వాల్‌ మరమ్మతులు సాగుతున్న సమయంలో ఎర్త్‌ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్ డ్యామ్‌ నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో భారీ వరదలు వచ్చినా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారు. గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లిస్తే మట్టి కట్ట నిర్మాణానికి ఎలాంటి అటంకాలు ఉండవని అంచనా వేస్తున్నారు. జూన్‌ నుంచి గోదావరిలో వరద ప్రవాహం మొదలైన పనులకు ఎలాంటి అటంకం ఉండదని భావిస్తున్నారు.

అన్ని అనుకూలిస్తే జులైలో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణం జరిగిన గ్యాప్‌ వన్ ప్రాంతంలో ఈ పనులు చేపడతారు. ప్రస్తుతం పోలవరంలో నిర్మాణ పనులను చేపట్టడానికి ఎలాంటి ఇబ్బందులు లేనందున పనుల్ని నిరంతరం కొనసాగించవచ్చని భావిస్తున్నారు. కాఫర్‌ డ్యామ్‌లు ఉండటంతో మట్టికట్టను నిరంతరాయంగా నిర్మించవచ్చని చెబుతున్నారు. భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చిన కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని తొలగించడం పెద్ద ఇబ్బంది కాదని పోలవరం అధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినా దాని ప్రభావం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌తో పాటు డయాఫ్రం వాల్‌ మరమ్మతులు సమాంతరంగా చేపట్టనున్నారు.

పోలవరం ఆనకట్ట నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే నిర్దిష్ట గడువేది లేకపోయినా 2024లోపు గ్రావిటీ మీద నీళ్లు అందించాలనే లక్ష్యం మాత్రం విధించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏడాది కావడంతో వీలైనంత త్వరగా ఎర్త్‌ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మట్టికట్ట నిర్మాణం జరిగే గ్యాప్‌1లో పనుల్ని జులైలో ప్రారంభించనున్నట్లు పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి తెలిపారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో అన్ని పనులు చేపట్టేందుకు అనువైన వాతావరణం ప్రస్తుతం పోలవరంలో ఉందని చెబుతున్నారు. పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే విషయంలో మాత్రం ఖచ్చితంగా డెడ్‌లైన్ ఉండదని, అందుకు సాంకేతిక అంశాలతో పాటు ప్రకృతి సహకారం కూడా అవసరమని భావిస్తున్నారు.

WhatsApp channel