Polavaram hydro project : 2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ : కేంద్రం-polavaram hydro power project will be completed by 2026 says central government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Polavaram Hydro Power Project Will Be Completed By 2026 Says Central Government

Polavaram hydro project : 2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ : కేంద్రం

HT Telugu Desk HT Telugu
Feb 06, 2023 07:29 PM IST

Polavaram hydro project : పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు 2026 నాటికి పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. దేశంలో నదుల అనుసంధానంలో భాగంగా 8 లింకు ప్రాజెక్టులకి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధమయ్యాయని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు (twitter)

Polavaram hydro project : పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ. 5,338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్‌కో తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఏపీజెన్‌కో (ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని మంత్రి తెలిపారు.

దేశంలో నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గుర్తించిన మొత్తం 30 లింకులలో 8 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సవివర ప్రాజెక్ట్‌ నివేదికలు పూర్తయ్యాయని జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ మరో 24 లింకు ప్రాజెక్ట్‌లకు సంబంధించి సాధ్యాసాధ్యాల (Feasibility) నివేదికలు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వ నేషనల్‌ పర్స్‌పెక్టివ్‌ ప్లాన్‌ కింద నదుల అనుసంధానం కోసం జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) దేశవ్యాప్తంగా 30 లింకులను గుర్తించింది. ఈ లింకులన్నింటికీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ అమలు కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మంత్రి చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌ అమలు దశలో మాత్రమే ప్రాజెక్ట్‌ నిర్మాణం వ్యయం, నిధుల సమీకరణ వంటి తదితర అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు... కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాప్తాడులో వినతి పత్రం అందజేశారు. గోదావరి బోర్డు కేంద్ర స్థానంపై తెలంగాణ... కృష్ణానది బోర్డు కేంద్ర స్థానంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే హక్కును విభజన చట్టం కల్పించిందని అన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటు విషయమై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో.. ఆ కార్యాలయం కర్నూలులో ఏర్పాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

IPL_Entry_Point