Phd Applicants for Constable Jobs : కానిస్టేబుల్ ఉద్యోగాలకు పిహెచ్‌డి స్కాలర్లు-phd scholors applied for constable jobs in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Phd Scholors Applied For Constable Jobs In Andhra Pradesh

Phd Applicants for Constable Jobs : కానిస్టేబుల్ ఉద్యోగాలకు పిహెచ్‌డి స్కాలర్లు

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 11:58 AM IST

Phd Applicants for Constable Jobs ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో పది రోజుల్లో ప్రాథమిక రాత పరీక్ష జరుగబోతోంది. 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు లక్షల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే వారిలో పది మంది పిహెచ్‌డి పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్లు విడుదల
కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్లు విడుదల

Phd Applicants for Constable Jobs ప్రభుత్వ ఉద్యోగమైతే చాలు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలనుకుంటే ఎలా అనుకున్న యువత విద్యార్హతలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ రిక్రూ‌ట్‌మెంట్ బోర్డు ద్వారా జరుగుతున్న నియామక పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గురువారం నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. మరోవైపు కానిస్టేబుల్ దరఖాస్తుల బ్రేకప్ వివరాలను ప్రకటించింది.

కానిస్టేబుల్ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఎంపికయ్యే ఈ పోస్టులకు పది మంది పీహెచ్‌డీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 94మంది ఎల్‌ఎల్‌బీ పూర్తైన అభ్యర్థులు, 13,961మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వారు 2,97,655మంది, బిఎస్సీ 61419, బికాం అభ్యర్థులు 40548, బిటెక్ అభ్యర్థులు 31,695, బిఏ చదివిన వారు 21,024మంది ఉన్నారు. పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ రెండేళ్లు చదివి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 16,945మంది ఉన్నారు. డిప్లొమా చదివిని వారు 15,254మంది, ఎంబిఏ అభ్యర్థులు 5284 మంది, ఎమ్మెస్సీ అర్హత ఉన్నవారు 4365మంది, ఇతర డిగ్రీలు చదివిన వారు 4,134మంది ఉన్నారు. ఎంఏ చదివిన వారు 1845మంది, ఎంకాం చదివిన వారు 1527మంది, ఎం టెక్‌ చదివిన వారు 930మంది ఉన్నారు. .

నాలుగేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌‌తో నిరుద్యోగుల్లో భారీ పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి దాదాపు 82.5 మంది ప్రాథమిక స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించినా ఇంజనీరింగ్‌ చదివినవారు 31,695 మంది, బీఏ, బీఎస్సీ, బీకామ్‌ డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు 1,22,991 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

కానిస్టేబుల్ కొలువులకు ఈ నెల 22న జరిగే ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,100 కానిస్టేబుల్‌ పోస్టులకు 3,95,415 మంది పురుషులు.. 1,08,071 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. 3580 సివిల్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఏపీఎస్పీలో 2520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022నవంబరు 28న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 20వరకూ హాల్‌ టికెట్లు పీఆర్‌బీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరవ్వాలని బోర్డు సూచించింది.

పరీక్షలో 200 మార్కులకు సంబంధించిన ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు 100మీటర్లు, 1600మీటర్ల పరుగు ఈవెంట్లు నిర్వహించి, అర్హులైన వారిని ఫైనల్‌ పరీక్షకు బోర్డు ఎంపిక చేస్తుంది. తుది పరీక్షలో సాధించే మార్కుల మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లు రోస్టర్‌ పద్దతిలో అమలు చేసి తుది ఎంపిక చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్