Peta Boy Kidnap case : బాలుడి కిడ్నాప్‌ … గంటల్లో చేధించిన పల్నాడు పోలీసులు….-palnadu police traced 8 years boy within hours after kidnap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Palnadu Police Traced 8 Years Boy Within Hours After Kidnap

Peta Boy Kidnap case : బాలుడి కిడ్నాప్‌ … గంటల్లో చేధించిన పల్నాడు పోలీసులు….

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 08:27 AM IST

Boy Kidnap చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితుల్ని వెంటాడటంతో గంటల వ్యవధిలోనే చిన్నారిని సురక్షితంగా కనుగొనగలిగారు.

చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడితో పల్నాడు ఎస్సీ
చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడితో పల్నాడు ఎస్సీ

Boy Kidnap తమిళనాడుకు చెందిన చిన్నారి తల్లితో కలిసి దసరా సెలవులకు చిలకలూరి పేట వచ్చాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా అగంతకులు ఎనిమిదేళ్ల బాలుడిని కార్లో ఎక్కించుకుని పరారయ్యారు. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పేరంబాకంలో ధాన్యం వ్యాపారం చేసే బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి కోటి రుపాయలు డిమాండ్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో వెదుకుతున్న బంధువులకు కిడ్నాప్‌ సమాచారం తెలియడంతో తల్లడిల్లిపోయారు. పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

బాలుడి కిడ్నాప్‌ వ్యవహారంతో అప్రమమత్తమైన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. బాలుడి తల్లిదండ్రులకు నిందితులు డబ్బుకోసం ఫోన్లు చేస్తుండటంతో వారిపై నిఘా ఉంచారు. చివరకు పోలీసులకు దొరికిపోతామన్న భయంతో నెల్లూరు జిల్లా కావలిలో వదిలేసి పారిపోయారు.

ఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం చిలకలూరిపేటకు చెందిన అరుణ, తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పేరంబాకానికి చెందిన ధాన్యం వ్యాపారి శరవణన్‌ దంపతులు. అరుణ తల్లిదండ్రులు చిలకలూరిపేటలో ఉంటున్నారు. దసరా సెలవులు కావడంతో అరుణ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చారు. ఆదివారం రాత్రి 9.45 గంటలకు కరెంటుపోగా, అదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న చిన్న కుమారుడు ఎనిమిదేళ్ల రాజీవ్‌ సాయిని ఆగంతుకులు కారులో అపహరించారు.

కుటుంబసభ్యులు వెతుకుతుండగానే, రాత్రి 11.45కు పేరంబాకంలోని శరవణన్‌కు ఫోన్‌ చేసి రూ.కోటి ఇవ్వాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కిడ్నాప్‌ విషయాన్ని బాధితులు పోలీసులకు తెలిపారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌, చిలకలూరిపేట అర్బన్‌ సీఐ రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా దుండగుల లోకేషన్‌ను గుర్తించారు.

బాలుడికి హాని చేయవద్దని తాను చెన్నై నుంచి బయలుదేరి వస్తున్నానని తండ్రి కిడ్నాపర్లకు చెప్పాడు. దీంతో నిందితులు తమిళనాడు వైపు ప్రయాణించారు. బాలుడితో సహా నెల్లూరు జిల్లా కావలి సమీపంలో హైవేపై పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. దీనిని గమనించిన కిడ్నాపర్లు సర్వీసు రోడ్డులో బాలుడిని వదిలేసి పారిపోయారు. బాలుడిని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లు ముగ్గురు ఉన్నారని, తమ గురించి నాన్నకు చెబితే చంపేస్తామని బెదిరించారని బాలుడు తెలిపాడు.

విజయవాడ నుంచి అద్దె కారులో కిడ్నాపర్లు….

కిడ్నాపర్లు వినియోగించిన కారు విజయవాడలోని ట్రావెల్స్‌ సంస్థ వద్ద తేజ అనే వ్యక్తి పేరిట బుక్‌ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలుడు రాజీవ్‌సాయిని కావలిలో విడిచిపెట్టాక దుండగులు వెళ్లిన మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి కారు నంబరు గుర్తించారు. కిడ్నాపర్లు సుమారు 70 సార్లు శరవణన్‌కు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు బాలుడి తండ్రితో వారు మాట్లాడేలా సూచనలిచ్చారు.

ఈ క్రమంలో కారు వెళ్లే మార్గాన్ని కనిపెట్టారు. చిన్నారిని వదిలేశాక నిందితులు సర్వీస్‌ రోడ్డులో కారును ‌రాంగ్‌ రూట్‌లో పరారయ్యారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ రద్దీగా ఉండటంతో కారును పట్టుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. సిసిటివి ఫుటేజీల్లో నిందితులు వినియోగించిన వాహనాన్ని గుర్తించి నిందితుల అచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.

IPL_Entry_Point