Dance Master Chaitanya: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య సెల్ఫీ సూసైడ్ కలకలం, అప్పుల తీర్చలేకే ఆత్మహత్యా?-nellore dhee show dance master chaitanya selfie suicide not getting suffient money in dhee debts reasons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dance Master Chaitanya: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య సెల్ఫీ సూసైడ్ కలకలం, అప్పుల తీర్చలేకే ఆత్మహత్యా?

Dance Master Chaitanya: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య సెల్ఫీ సూసైడ్ కలకలం, అప్పుల తీర్చలేకే ఆత్మహత్యా?

HT Telugu Desk HT Telugu
May 01, 2023 02:40 PM IST

Dance Master Chaitanya: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. అప్పులు తీర్చలేక, అనుకున్నంత సంపాదించలేకపోయానన్న ఒత్తిడితో సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో చైతన్య తెలిపారు.

ప్రభుదేవాతో డాన్స్ మాస్టర్ చైతన్య
ప్రభుదేవాతో డాన్స్ మాస్టర్ చైతన్య

Dance Master Chaitanya: ప్రముఖ డాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని ఓ క్లబ్ హోటల్‌లో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులు ఎక్కువయ్యాయని వాటిని తీర్చే డబ్బు సంపాదించలేకపోతున్నానన్న ఆవేదనతో సూసైడ్ చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో తెలిపారు. తాను ఎంత ప్రయత్నించినా అనుకున్నంత సంపాదించలేకపోయానని అందుకే ఆత్మహ‌త్య చేసుకుంటాన‌న్నారు.

నెల్లూరు జిల్లా ఉత్తమ‌వారిపాలెం గ్రామానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ చైతన్య కొంత కాలంగా హైదరాబాద్ లో ఉంటూ ఢీ షోలో కొరియోగ్రాఫర్ గా ప‌నిచేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సివచ్చిందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తనకు ఇంతటి పేరు వచ్చేలా చేసిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఢీ ప్రోగ్రాంతో పేరు వచ్చింది కానీ సంపాదన రాలేదన్నారు. జబర్దస్త్ ప్రోగ్రాంతో చేసేవాళ్లకు డబ్బులు వస్తాయని, ఢీ లో అలాకాదన్నారు.

సెల్ఫీ వీడియో కలకలం

ఆత్మహత్యకు ముందు డ్యాన్స్ మాస్టర్ చైతన్య సెల్ఫీ వీడియోలో... తల్లిదండ్రులు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పారు. చేసిన అప్పులు తీర్చేందుకు చాలా ట్రై చేశానని, కానీ తీర్చలేకపోయానని చైతన్య అవేద‌న వ్యక్తం చేశారు. ఢీ ప్రోగ్రాంతో పేరు వచ్చినా, సంపాదించుకోలేకపోతున్నామని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. ఇల్లు, టీవీ, ఇలా కావాల్సినవి కూడా కొనుక్కోలేకపోయామన్నారు. నెల్లూరులోని క్లబ్ లో ఆత్మహత్య చేసుకున్న చైతన్య... సెల్ఫీ వీడియోని తన ఫ్రెండ్స్ కు పంపించారు. అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఈ సెల్ఫీ సూసైడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్ని సమస్యలున్నా ఒక్క మాట కూడా చెప్పలేదు- చైతన్య తల్లి ఆవేదన

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది సెలబ్రిటీలు అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్లకు టీవీ షోలలో అవకాశాలు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్లు అంచెలంచెలుగా ఎదురుగుతున్నారు. అయితే వచ్చిన అవకాశాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేం. ఈ ఘటనకు ఉదాహరణ డ్యాన్స్ మాస్టర్ చైతన్య సూసైడ్. ప్రముఖ ఛానల్స్ లో వచ్చే ఢీ షో కు మంచి ప్రజాదరణ ఉంది. ఇందులో డ్యాన్స్ చేసే యువతీయువకులతో పాటు కొరియోగ్రాఫర్ కు మంచి పేరు వస్తుంది. అయితే పేరు మాత్రమే వస్తుంది కానీ సంపాదనలేదని ఓ యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలంరేపుతోంది. అప్పు తీర్చే సామర్థ్యం ఉన్నా ఒత్తిడి భరించలేక చైతన్య సూసైడ్ చేసుకోవడంపై బంధువులు తట్టుకోలేకపోతున్నారు.

తన కొడుక్కి అన్ని సమస్యలున్నా తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం కన్నీటి పర్యంతం అవుతున్నారు. పెళ్లి చేసుకోనని తరచూ చెప్పేవాడని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటానని చైతన్య అనేవాడని ఆమె అన్నారు. ఇటీవల జామాయిల్ తోట అమ్మగా వచ్చిన 4 లక్షలు తన వద్ద ఉన్నాయని చైతన్యకు తెలుసని కానీ ఆ డబ్బులు కూడా అడగలేదన్నారు. ఇప్పుడిలా అప్పుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడంటే తనకేం అర్థం కావడంలేదని ఆవేదన చెందారు.

Whats_app_banner