Jagananna Vidya Deevena: మళ్లీ వాయిదా పడిన జగనన్న విద్యా దీవెన-jagananna vidya deevena programme postponed with undisclosed reasons for second time ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Jagananna Vidya Deevena Programme Postponed With Undisclosed Reasons For Second Time

Jagananna Vidya Deevena: మళ్లీ వాయిదా పడిన జగనన్న విద్యా దీవెన

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 12:18 PM IST

Jagananna Vidya Deevena ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విద్యా దీవెన కార్యక్రమం వాయిదా పడింది. విద్యార్ధులకు నిధులు విడుదల చేసే తేదీని ప్రకటించకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం జగన్
సీఎం జగన్

Jagananna Vidya Deevena జగనన్న విద్యాదీవెన మరోమారు వాయిదా పడింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను విద్యార్థులకు రూ. 700 కోట్ల నిధులను విద్యార్దులకు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. 2022-23 విద్యాసంవత్సరానికి 10.50 లక్షల మందికి ‘విద్యాదీవెన’ పథకం ద్వారా నిధులు విడుదల కావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విడుదల కావాల్సిన విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది.

ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28న ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా, ఇంకోసారి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటూ జిల్లాలకు ప్రభుత్వం సమాచారం పంపింది. అయితే, మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై చదువుతున్న విద్యార్ధుల్లో పరీక్షల సమయంలో చెల్లింపుల్లో జాప్యం జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. జూలై – సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను గత ఏడాది నవంబర్‌లో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జమ చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన పేరుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే వందశాతం ఫీజులన్నింటినీ ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలకు జమ చేస్తోంది. మూడున్నర సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, పిల్లలు బాగుండాలని,ఆ చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, హాస్టల్‌ ఖర్చులు కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి రూ.20వేలు వరకు జగనన్న వసతి దీవెన పథకాన్ని కూడా తీసుకొచ్చామని జగన్ గతంలో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాలంలో 2017–18, 2018–19కు సంబంధించి రూ.1778 కోట్లు బకాయిలు పెడితే వాటిని కూడా తామే చెల్లించామని వివరించారు.

మూడున్నర సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3349 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు సైతం తీరుస్తూ... కేవలం ఈ రెండు పథకాలకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టినట్లు వివరించారు. 2022 జూలై నుంచి సెప్టెంబరు వరకు సంబంధించిన మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే... జగనన్న విద్యా దీవెన డబ్బును 11.02 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా రూ.694 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.

వరుసగా మూడున్నరేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా కానుక నిధుల్ని విడుదల చేస్తూ వచ్చినా ఎన్నికల ఏడాది ముందు నిధుల విడుదల జాప్యం జరగడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్నికల ఆంక్షల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారా, నిధుల లేమితో వాయిదా పడిందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారులు మాత్రం త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్