Devineni Avinash : బెజవాడ తూర్పులో బోణీ కొడతారా…?-is it easy for devineni avinash to win on behalf of ycp in vijayawada east constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Is It Easy For Devineni Avinash To Win On Behalf Of Ycp In Vijayawada East Constituency?

Devineni Avinash : బెజవాడ తూర్పులో బోణీ కొడతారా…?

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 07:52 AM IST

Devineni Avinash బెజవాడ తూర్పు అభ్యర్ధి విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. దేవినేని అవినాష్‌ను అభ్యర్ధిగా ఖరారు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్ధిని ప్రకటించడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు వైసీపీ అధినేత ప్రయత్నించారు. అభ్యర్ధిని ప్రకటించినా విజయవాడ తూర్పు బరిలో వైసీపీ విజయం ఎంత వరకు ఖాయమనే చర్చ ఇప్పుడు బెజవాడ వీధుల్లో జోరుగా సాగుతోంది.

విజయవాడ తూర్పు అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు
విజయవాడ తూర్పు అభ్యర్ధిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు

Devineni Avinash బెజవాడ రాజకీయాల్లో గత కొద్ద రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరదించేశారు. విజయవాడ తూర్పు అభ్యర్ధిగా దేవినేని అవినాష్‌ను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ పార్లమెంటు పరిధిలో తూర్పులో మాత్రమే వైసీపీ జెండా ఎగురవేయలేకపోయింది. 2024లో తూర్పు నియోజక వర్గాన్ని దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న వైసీపీ ఆ బాధ్యతలు దేవినేని అవినాష్‌కు అప్పగించింది.

విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారుఈ సమావేశంలో పాంత్రీయ సమన్వయకర్త అయోధ్యరామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో ముఖ్యమంత్రి విడివిడిగా మాట్లాడారు.

మరో 14–15 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయని, గడపగడపకూ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నామని ముఖ్యమంత్రి కార్యకర్తలకు చెప్పారు. ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలని సూచించారు. సచివాలయాల వారీగా కన్వీనర్లు, ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహ సారథులను పార్టీ నుంచి నియమిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. గృహ సారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలని నేతలకు సూచించారు. ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలని, ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశామని, అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోందని సిఎం చెప్పారు. కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయగలిగామని, విజయవాడ ఈస్ట్‌లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల గెలిచామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగామని, మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలని దిశా నిర్దేశం చేశారు.

బెజవాడలో పాగా సులువేనా….

ఏపీలో జిల్లాల విభజన తర్వాత ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాలో మొదటి అభ్యర్థిని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే వైసీపీ అనుకున్నంత సులువుగా తూర్పు నియోజక వర్గంలో జెండా ఎగురవేయడం సాధ్యం కాకపోవచ్చు. సంక్షేమ పథకాల కంటే సామాజిక సమీకరణలే ఇక్కడ ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా కమ్మ, కాపు ఓటర్లే తూర్పులో అభ్యర్థుల గెలుపొటముల్ని నిర్ణయిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో తూర్పు నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్‌పై టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ 15,164ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో కూడా గద్దె రామ్మోహన్ తూర్పులో గెలిచారు.

2009 ఎన్నికల్లో తూర్పు నియోజక వర్గం నుంచి గెలిచిన యలమంచిలి రవి వైసీపీలో ఉన్నా ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన భవకుమార్ ఆర్థికంగా నష్టపోయారు. 2019 ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్‌ భారీగా ఖర్చు చేసినా ఓటమని మాత్రం తప్పించుకోలేకపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి గత మూడేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే తూర్పులో దేవినేని అవినాష్‌ గెలుపును ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నియోజక వర్గ ఓటర్లలో రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు దక్కించుకోవాల్సి ఉంటుంది.

దేవినేని అవినాష్‌ సొంత సామాజిక వర్గం మద్దతు టీడీపీని కాదని ఆ‍యనకు ఓటు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మరో బలమైన కాపు సామాజిక వర్గం దేవినేని కుటుంబాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దీనికి తోడు దేవినేని శిబిరంలో ఉన్న కొందరు నాయకుల వ్యవహార శైలిపై నియోజక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వారంతా అదను కోసం ఎదురు చూస్తున్నారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేసినా టీడీపీ అభ్యర్థి సులువుగా గెలిచాడు. ఈ దఫా ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. అదే జరిగితే తూర్పులో వైసీపీ జెండాను ఎగుర వేయడం వైసీపీ కష్టం అవుతుంది. అధికార పార్టీ మాత్రం 175కు 175 స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాలనే ధ్యేయంతో ఉంది. అది ఎంత వరకు నెరవేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

IPL_Entry_Point

టాపిక్