DGP Twitter Account : హవ్వా….డీజీపీ ట్విట్టర్‌ ఖాతానే హ్యాక్ చేసేశారు….-hackers challenged ap police with hacking ap dgp official twitetr account ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dgp Twitter Account : హవ్వా….డీజీపీ ట్విట్టర్‌ ఖాతానే హ్యాక్ చేసేశారు….

DGP Twitter Account : హవ్వా….డీజీపీ ట్విట్టర్‌ ఖాతానే హ్యాక్ చేసేశారు….

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 11:55 AM IST

DGP Twitter Account ఏపీ డీజీపీట్విట్టర్‌ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. సైబర్ నేరాల నిరోధంలో తమకే తామే సాటి అని చెప్పుకునే ఏపీ పోలీసు బాస్ ఖాతానే నిందితులు హ్యాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం డీజీపీ అధికారిక ఖాతాలో అశ్లీల చిత్రాలు దర్శనమివ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు
ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు

DGP Twitter Account ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. డీజీపీ ఖాతాలో ఓ అశ్లీల చిత్రాన్ని పోస్టు చేసి.. దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆదివారం మధ్యాహ్నం ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన పోలీసు సాంకేతిక సేవల విభాగం ఆ పోస్టులను తొలగించింది. ఈ వ్యవహారంపై విజయవాడలోని సైబర్‌ నేరాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో ఆదివారం కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ 'డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ట్విటర్‌ ఖాతా ను 2020 నుంచి వినియోగించడం లేదు. . 2020 ఫిబ్రవరి నుంచి ఈ ఖాతా క్రియా శీలకంగా లేదు. దీంతో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దీన్ని హ్యాక్‌ చేశారు. అధికారులు మారినప్పుడు కొత్త అకౌంట్లను క్రియేట్‌ చేయడంతో పాటు ఇతర కారణాలతో పాత ఖాతాలను కొనసాగించకపోవడంతో సైబర్‌ నేరగాళ్లకు హ్యాక్‌ చేయడానికి వీలు కలిగింది.

డీజీపీ ట్విట్టర్ ఖాతాను దుర్వినియోగం చేశారు. అసభ్యకరమైన ఫొటోలకు ఈ ఖాతా నుంచి లైకులు కొడుతూ, వాటిని పోస్టు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని గుర్తించారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు సాంకేతిక సేవల విభాగం డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు సోషల్ మీడియాలో రాజకీయ ప్రేరేపిత కామెంట్లు, పోస్టుల విషయంలో ఏపీ సైబర్ నేరాల నిరోధక విభాగం అప్రమత్తంగా ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేకంగా నిపుణులు పనిచేస్తుంటారు. ప్రతి జిల్లాకు ఓ ఫేస్‌ బుక్ పేజీని కూడా నిర్వహిస్తున్నారు. ప్రజలకు చేరువ కావడానికి సామాజిక మాధ్యమాలను ఏపీ పోలీసులు విరివిగా వినియోగిస్తున్నారు. నేరాల నిరోధం కంటే అధికారుల వ్యక్తిగత ప్రచారాలకే ఈ పేజీలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయనే విమర్శలు లేకపోలేదు.

సాక్షాత్తూ డీజీపీ ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా పోలీసులకు సవాలు విసిరిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ కామెంట్లు, విమర్శలు చేసే వారిపై ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది. కొన్ని కేసుల్లో అరెస్టులు చేసినా న్యాయస్థానాల్లో అవి నిలవడం లేదు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో న్యాయస్థానాలు వెంటనే బెయిల్ మంజూరు చేస్తున్నాయి. ఇప్పుడు డీజీపీ ఖాతాను హ్యాక్‌ చేసిన వారు ఎక్కడి నుంచి చేశారో, ఎవరు చేశారో పోలీసులు గుర్తించ గలుగుతారో లేదో వేచి చూడాలి.

IPL_Entry_Point

టాపిక్