Kidnap In Guntur : మిర్చి వ్యాపారి కిడ్నాప్…కాపాడిన పోలీసులు….-guntur police busted kidnap guntur mirchi business man for financial transaction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Guntur Police Busted Kidnap Guntur Mirchi Business Man For Financial Transaction

Kidnap In Guntur : మిర్చి వ్యాపారి కిడ్నాప్…కాపాడిన పోలీసులు….

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 06:52 AM IST

Kidnap In Guntur ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారిని కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. డబ్బు కోసం వ్యాపారిని హింసించిన దుండగులు, పోలీసుల రాకను గుర్తించి బాధితుడిని వదిలేసి పారిపోయారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహచర వ్యాపారిగా గుర్తించారు.

సీఐ  అరెస్ట్
సీఐ అరెస్ట్

Kidnap In Guntur గుంటూరు మిర్చి యార్డులో వ్యాపార లావాదేవీల్లో మనస్ఫర్థల కారణంగా ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు గుంటూరు మిర్చి యార్డు సమీపంలో ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. గమనించిన స్థానికులు, ఇతర వ్యాపారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పందించి కాపాడారు.

గుంటూరు నగరంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కొత్తపేటకు చెందిన పొత్తూరి శివ నరేంద్రకుమార్‌ మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై మిర్చి యార్డుకు బయలుదేరిన శివకుమార్‌ను మిర్చి యార్డుకు సమీపంలో కాపుగాసిన ఆరుగురు దుండగులు అతనిపై దాడి చేశారు. బెదిరించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

స్థానికుల సమాచారంతో నరేంద్రకుమార్‌ కుమారుడు కృష్ణచైతన్య నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాపురానికి చెందిన మిర్చి వ్యాపారి బర్మా వెంకట్రావు తన తండ్రిని కిడ్నాప్‌ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డులో పొత్తూరు నరేంద్రకుమార్‌ ఎస్‌ఎన్‌కేటీ మిర్చిపేరుతో మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. మరో వ్యాపారి బర్మా వెంకట్రావు కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. 2019 నుంచి ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. వ్యాపారంలో భాగంగా నరేంద్ర తనకు రూ.4కోట్లు ఇవ్వాలని వెంకట్రావు చెబుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణల్ని నరేంద్ర కుమార్‌ ఖండిస్తున్నారు. తాను వెంకట్రావుకు నాలుగు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్థానిక ఎమ్మెల్యే సహాయంతో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. నరేంద్ర నుంచి డబ్బు వసూలు చేసుకోవాలని నిర్ణయించిన వెంకట్రావు కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. బుధవారం ఉదయం 7గంటలకు ఇంటి నుంచి నరేంద్ర బయటకు రాగానే చుట్టుగుంట సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద నరేంద్రను అడ్డగించి దాడి చేశారు. బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని చిలకలూరిపేట వైపు తీసుకువెళ్లారు. కిడ్నాప్ చేసిన వాహనంలో ఆరుగురు ఉన్నారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. వాహనం కోటప్పకొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు దిగిపోగా వెంకట్రావు వాహనంలో ఎక్కాడని చెప్పాడు.

దారిలో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తూ తీవ్రంగా హింసించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో మరో వాహనంలోకి మార్చిత్రిపురాంతకం తీసుకువెళ్లారు. నిందితుల ఒత్తిడితో చివరకు రూ.80లక్షలు చెల్లించడానికి నరేంద్ర అంగీకరించాడు. గుంటూరులో నగదుతీసుకోడానికి బయల్దేరారు. నిందితులు వినుకొండ దగ్గర నరేంద్ర చొక్కా చినిగిపోవడంతో కొత్త చొక్కా కొనడానికి దుకాణం దగ్గర ఆగారు.

అప్పటికే సాంకేతికత సాయంతో నిందితులను ట్రాక్ చేస్తున్న పోలీసులు వారిని వెన్నంటి వచ్చారు. షాపు దగ్గర ఆగిన సమయంలోపోలీసుల రాకను గుర్తించి వారు పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులకు ఆ మార్గంలోని ఓ రెస్టారెంట్‌లో వెంకట్రావు, అతనిఅనుచరుడు దొరికిపోయారు. తనను బాగా కొట్టి..రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేయడంతో ప్రాణభయంతో అంగీకరించానని బాధితుడు చెప్పారు.అంతకుముందు నరేంద్రకుమార్‌ కిడ్నాప్‌ను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేశారు.

IPL_Entry_Point

టాపిక్