Teacher Transfers : ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలు జారీ-guidelines released for teachers transfers in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teacher Transfers : ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలు జారీ

Teacher Transfers : ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలు జారీ

HT Telugu Desk HT Telugu
Dec 11, 2022 12:47 PM IST

Teacher Transfers ఆంద్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 1,2,3 విభాగాల్లోని టీచర్‌ పోస్టుల ఖాళీలు వెబ్ ఆప్షన్లలో కనిపించవని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నాటికి ఏపీలో ఉపాధ్యాయుల బదిలీను పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

Teacher Transfers ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో హైస్కూల్స్‌లో సబ్జెక్ట్‌ టీచర్స్‌, ఫౌండేషన్‌, ఫౌండేషన్ ప్లస్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తాజా బదిలీల్లో కొన్ని పోస్టుల్ని ప్రభుత్వం బ్లాక్ చేయనుంది. పాఠశాలల్లో మొత్తం మంజూరైన పోస్టులు కాకుండా ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారో అన్ని ఖాళీలను మాత్రమే వెబ్ ఆప్షన్లలో చూపిస్తారు. క్యాటగిరీ 1,2,3 విభాగాల్లో ఉన్న పోస్టుల్ని బ్లాక్ చేస్తారు.

ప్రభుత్వం వెబ్‌ ఆప్షన్లను బ్లాక్ చేయనుండటంతో ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏపీలో జనవరి 2 నుంచి పది వరకు సమ్మెటివ్ 1 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తై మార్కులు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేశాక బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది.

3-10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం హెడ్‌మాస్టర్‌ గ్రేడ్-2 సహా టీజీటీల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు బదిలీల ప్రక్రియ కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదొడుకులకు లోనుకాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.

డిసెంబరు 12 నుంచి జనవరి 12వ తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్‌ మాస్టర్‌ల సర్వీసు కనీసం 5ఏళ్లు ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఉపాధ్యాయుల బదిలీలకు నిబంధనలు ఇవే….

తాజా ఉపాధ్యాయుల బదిలీల్లో 2021-22 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. 2024 ఆగష్టు 31లోగా పదవీ విరమణ చేసే వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. జీరో సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రిక్వెస్ట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయినులు లేకుంటే 50ఏళ్లు దాటిన వారిని మాత్రమే నియమిస్తారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి సర్వీసును పరిగణలోకి తీసుకుంటారు. 80శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారిలో సీనియర్‌ను బదిలీ చేస్తారు. 80శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇస్తారు. వారి దరఖాస్తులను కూడా అనుమతిస్తారు.

2021 అక్టోబర్ 14న పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారి పోస్టులను ఖాళీలుగా చూపుతారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఐదు పాయింట్లను కేటాయించారు. జిల్లా స్థాయి నాయకులకు ఉన్న పాయింట్లను తొలగించారు.

ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్ ఇలా…..

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మేనేజ్‌మెంట్‌, కేటగిరీ, సబ్జెక్ట్‌, మీడియం వారీగా అందుబాటులో ఉన్న ఖాళీలను డిసెంబర్ 12,13 తేదీలలో ప్రకటిస్తారు.బదిలీ దరఖాస్తులను డిసెంబర్ 14-17 తేదీలలో ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. డిసెంబర్ 18-19 తేదీలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రాథమిక సీనియారిటీ జాబితాను డిసెంబర్ 20-22 తేదీలలో ప్రకటిస్తారు. డిసెంబర్ 23,24 తేదీలలో అభ్యంతరాలను పరిశీలిస్తారు. సీనియారిటీ జాబితాను డిసెంబర్ 26న ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్ల నమోదు అవకాశాన్ని డిసెంబర్ 27 నుంచి జనవరి 1 వరకు అనుమతిస్తారు. ఉపాధ్యాయులకు పాఠశాలలను జనవరి 2 తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేటాయిస్తారు. తుది జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 11న పున: పరిశీలిస్తారు. ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులను జనవరి 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point