Fake IT Raid In Guntur: ఐటీ రైడ్ పేరుతో లక్షల్లో లూటీ.. గుంటూరులో ఘరానా చోరీ-fake it raid in guntur accused looted rs 50lacs cash and huge quantity of gold ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Fake It Raid In Guntur Accused Looted Rs.50lacs Cash And Huge Quantity Of Gold

Fake IT Raid In Guntur: ఐటీ రైడ్ పేరుతో లక్షల్లో లూటీ.. గుంటూరులో ఘరానా చోరీ

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 09:16 AM IST

Fake IT Raid In Guntur: ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడిన ఘటన గుంటూరు శివార్లలోని ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. మహిళను ఇంట్లో నిర్బంధించి సోదాల పేరుతో రూ. 50లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలను పట్టుకెళ్లారు. ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

సోదాలు చేస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న కళ్యాణి
సోదాలు చేస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న కళ్యాణి

Fake IT Raid In Guntur: ఐటీ సోదాల పేరుతో ఒంటి మహిళ ఇంట్లోకి చొరబడి లక్షల రుపాయలు దోచుకున్న ఘటన గుంటూరులో జరిగింది. బాధితురాలు ఒంటరిగా నివసిస్తుండటంతో సినీ ఫక్కీలో మహిళను మోసం చేసి రూ.50 లక్షల నగదు, ఆభరణాలు దోచుకున్నారు.

అచ్చం సినిమాల్లో మాదిరి ఒంటరిగా ఉన్న మహిళను ఆదాయ పన్నుశాఖ అధికారులమని నమ్మించి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన గుంటూరు శివార్లలో వెలుగు చూసింది. నగర శివారులోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న సింగంశెట్టి కల్యాణి ఇంట్లోకి గురువారం ఉదయం 10.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు.

ఐటీ తనిఖీల పేరుతో రెండు గంటలకు పైగా ఆమెను ఇంట్లోనే నిర్బంధించి రకరకాలుగా ప్రశ్నించారు. విచారణ పేరుతో ఆమె వద్ద ఉన్న ఫోన్లు సైతం తీసుకున్నారు. కళ్యాణి వద్ద భారీగా నగదు ఉందని, ఐటీ చెల్లింపులు చేయడం లేదంటూ ఐడెంటీ కార్డులు చూపించారు. నగదు ఎక్కడ దాచి పెట్టారో చూపించాలని బెదిరించారు. ఇంట్లోకి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మాస్క్‌లు ధరించారు.

ఐటీ సోదాల పేరుతో ఇల్లంతా వెదికి బియ్యం డ్రమ్ములో నగదు కట్టలు, ట్రంకు పెట్టెల్లో దాచిన బంగారు ఆభరణాలు గుర్తించారు. వాటిని బయటకు తీసి వాటి వివరాల్ని తెల్ల కాగితంలో రాసుకుని తమ వెంట తెచ్చుకున్న సిరాను బాధితురాలి చేతికి రాసి ఆమె నుంచి వేలిముద్రలు సేకరించారు. ఆ తర్వాత నగదు కట్టలు, ఆభరణాలను కల్యాణి ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెతో పాటు, తమ వెంట తెచ్చుకున్న రెండు బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆమె ఇంట్లో లెక్కల్లోకి రాని నగదు దొరికిందని, కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సి ఉంటుందని బెదిరించారు. కేసు లేకుండా చేయటానికి రూ.50 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రాత్రి 7 గంటలకల్లా లంచం మొత్తాన్ని సమకూర్చి ఉంచుకోవాలని చెప్పి కారులో ఉడాయించారు. వెళ్తూ, వెళ్తూ కళ్యాణి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. హార్డ్‌ డిస్క్‌‌లను తమ వెంట పట్టుకెళ్లారు. వారు అక్కడి నుంచి వెళ్లగానే బాధితురాలు కల్యాణి తేరుకుని బంధువులకు విషయం తెలియజేసి వారితో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాత గుంటూరు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఈస్ట్‌ డీఎస్పీ సీతారామయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీం బృందాలు వివరాలు సేకరించాయి.

బాధితురాలు కళ్యాణి గతంలో ఒకరితో సహజీవనం చేసిందని, ఇది తెలిసిన వారి పనై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మూడు క్లూస్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. డబ్బులు పోగొట్టుకున్న కల్యాణి, దొడ్డా ఫణి భూషణ్‌తో కలిసి సహజీవనం చేస్తుండగా రెండేళ్ల క్రితం కరోనాతో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఫణిభూషణ్‌ సమీప బంధువు ప్రసాద్‌తో కలిసి ఉంటోంది.

మహిళతో కలిసి ఉంటున్న ప్రసాద్‌ వ్యాపార లావాదేవీల్లో వచ్చిన నగదుతో పాటు బంగారు ఆభరణాలు కల్యాణి ఇంట్లో భద్ర పరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారుదుండగులు రూ.50లక్షల నగదు, అరకిలోకు పైగా బంగారం పట్టుకెళ్లారని కల్యాణి వివరించారు. బాధితురాలు చెబుతున్నంత నగదు, బంగారం నిజంగా ఉందా అనే పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, అంత మొత్తంలో వారికి నగదు, ఆభరణాలు ఎలా వచ్చాయనే నే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల గురించి ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

IPL_Entry_Point

టాపిక్