Cyclone Mandous Effect : ఏపీలో కొనసాగుతున్న వర్షాలు…..-cyclone mandous effect rainfall continues in andhra pradesh coastal districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Cyclone Mandous Effect Rainfall Continues In Andhra Pradesh Coastal Districts

Cyclone Mandous Effect : ఏపీలో కొనసాగుతున్న వర్షాలు…..

తుఫాను తీరం దాటినా కోస్తా జిల్లాల్లో తొలగని ముప్పు
తుఫాను తీరం దాటినా కోస్తా జిల్లాల్లో తొలగని ముప్పు (AFP)

Cyclone Mandous Effect ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. తుఫాను అల్పపీడనంగా బలహీనపడినా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ సూచించారు. ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు పంట నష్టం అంచనా వేసే పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా అధికారులకు సూచించారు.

Cyclone Mandous Effect మాండౌస్‌ తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు తుఫాను ముప్పును తగ్గించడానికి అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి ఆదేశాలు జారీ చేశారని వివరించారు. అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాను కదలికల్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

తుపాను సమయంలో విపత్తుల సంస్థ యంత్రాంగం 24 గంటలు నిరంతరం పనిచేస్తూ సత్వరం స్పందించడంతో పాటు ముప్పును స్పష్టంగా అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన నష్ట తీవ్రతను తగ్గించగలిగామని చెప్పారు. తుఫాను సమయంలో సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. భారీ వర్షాలు, ఈదుర గాలులు నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు వివరించారు.

ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరుకు-2 మొత్తంగా 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.

శుక్రవారం ఉదయం 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.

శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.

సిఎస్ టెలీ కాన్ఫరెన్స్…..

మాండౌస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం గ్రామాల్లో పర్యటించాలని సిఎస్ ఆదేశించారు.

వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సియంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు.

టాపిక్