Graduate MLC Elections : వైకాపా బోగస్ పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తోంది... చంద్రబాబు-chandrababu alleges bogus vote entries by ysrcp in graduate council polls ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandrababu Alleges Bogus Vote Entries By Ysrcp In Graduate Council Polls

Graduate MLC Elections : వైకాపా బోగస్ పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తోంది... చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 07:15 PM IST

Graduate MLC Elections : ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో... అధికార వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అర్హత లేని వారిని ఓటర్లుగా నమోదు చేస్తూ.. బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు (twitter)

Graduate MLC Elections : రాష్ట్రంలో మూడు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అక్రమాలకు తెరతీసిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయడం ద్వారా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు బయట పడ్డాయని... పట్టభద్రులు కాని వారినీ ఓటర్లుగా చేర్చడం.... ఇతర ప్రాంతాల వారికీ ఈ ప్రాంతాల్లో ఓటు రాయించడం వంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇలా దొంగ ఓట్లు చేర్పించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు... అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో ఓట్లు పొంది ఓటు వేసే వాళ్లు కూడా శిక్షార్హులు అవుతారని చంద్రబాబు హెచ్చరించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లపై స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయడంతో పాటు...కేంద్ర ఎన్నికల సంఘం వరుకు ఫిర్యాదులు పంపి చర్యలు కోరాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నెల 13 తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, బాధ్యులతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ పక్క బోగస్ ఓట్లు... మరో పక్క ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ....వీటిని సమర్థవంతంగా అడ్డుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే అధికార పార్టీ ప్రయత్నం నీచమైన చర్య అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం ద్వారా తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు గెలిచేలా చూడాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

కొన్ని సందర్భాల్లో ఓటర్ల రెండో ప్రాధాన్య ఓటు కీలకంగా మారుతుందన్నారు చంద్రబాబు. ఆ ఓటు టీడీపీ అభ్యర్థికే పడేలా చూడాలని నేతలకు సూచించారు. రెండో ప్రాధాన్యత ఓటుపై గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కారణంగా గ్రామ స్థాయి వరకు ప్రచారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు... తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్... పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిల గెలపుకోసం పార్టీ నేతలు, ఇంచార్జ్ లు శక్తి వంచన లేకుండా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

IPL_Entry_Point