AP Ministers: ఇవేం లీకులు ఇవేం బెదిరింపులు.. మంత్రుల్లో అసహనం-cabinet colleagues are unhappy with the news that they will be removed from the ministry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cabinet Colleagues Are Unhappy With The News That They Will Be Removed From The Ministry

AP Ministers: ఇవేం లీకులు ఇవేం బెదిరింపులు.. మంత్రుల్లో అసహనం

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 06:47 AM IST

AP Ministers: ఏపీలో ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే లీకులు క్యాబినెట్‌లో కలకలం రేపుతున్నాయి.పనితీరు ఆధారంగానే మంత్రుల్ని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా ప్రచారాలకు తెర లేపారని అసంతృప్త వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

AP Ministers: పనితీరు ఆధారంగా ఏపీలో ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని తొలగించి వారి స్థానంలో మరికొందర్ని భర్తీ చేస్తారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పనితీరు ఆధారంగా మంత్రులపై చర్యలు ఉంటాయని క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

పనితీరు బాగోలేని మంత్రులను తొలగించేందుకు వెనుకాడనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారని పని తీరు బాగోలేని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కథనాలు వెలువడ్డాయి.

సీఎం వ్యాఖ్యలతో ఏపీ క్యాబినెట్‌లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరితో పాటు మరో మంత్రిని కూడా ఇంటికి పంపుతారని ప్రచారం మొదలైంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో కొన్ని సామాజిక వర్గాకలు ప్రాధాన్యత లేకుండా పోయింది. ప్రధానంగా కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య వర్గాల నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు. రాష్ట్రంలో నియోజక వర్గాల వారీగా ఓటర్ల ప్రభావం, రానున్న ఎన్నికల్లో ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు.

క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా మంత్రుల స్థానాల్లో మార్పులు చేస్తున్నారా లేకుంటే పనితీరు ఆధారంగా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది ముందు క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు రాజకీయంగా సాధారణమే అయినా ఫలానా వారిపై వేటు పడబోతున్నట్లు వార్తలు వెలువడటం మాత్రం ఖచ్చితంగా వ్యూహాత్మకమేనని చెబుతున్నారు.

నిజానికి ఏపీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరికి మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం గతంలో ఉండేది. ప్రభుత్వం ఏర్పడిన తొలి క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కొడాలి నాని వంటి వారు మాత్రమే ప్రత్యర్థులపై దూకుడుగా, స్వేచ్ఛగా మాట్లాడేవారు. గత ఏడాది పదవి కోల్పోయాక ఆ స్వేచ్ఛ ఉన్న మంత్రులు క్యాబినెట్‌లో ఒక్కరు కూడా లేకుండా పోయారు.

ఏపీ క్యాబినెట్‌ మంత్రులు, అధికార ప్రతినిధుల్లో ఎవరు ఏమి మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాల్సిందే. వారి శాఖ పరమైన వ్యవహారాలు తప్ప రాజకీయంగా ఎలాంటి వ్యా‌ఖ్యలు చేయాలన్నా ప్రభుత్వ మీడియా సలహాదారుడి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా మీడియా ముందుకు రాకూడదనే ఆంక్షలు ఉన్నాయని మంత్రులు అంగీకరిస్తారు. మంత్రులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే మరుక్షణం వారికి వార్నింగ్ వచ్చేస్తుందని గతంలో మంత్రులుగా పనిచేసిన వారు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుని వాపోయేవారు.

తాజాగా మళ్లీ పనితీరు ఆధారంగా మంత్రులపై వేటు అనే ప్రచారాలు కూడా వ్యూహాత్మకమేనని, ప్రభుత్వ పెద్దలకు ఏ లెక్కలు క్యాబినెట్ జాబితాను సరి చేయాలనే ఆలోచన వచ్చినా ఎవరో ఒకరిని బలి చేయక తప్పదని చెబుతున్నారు. తాజాగా దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన పేర్లు కూడా ఈ కోవలోనే తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో తోట త్రిమూర్తులు, మర్రి రాజశేఖర్‌లను క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం మొదలైంది.

కమ్మ సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో ప్రాధాన్యత లేకపోవడం, గోదావరి జిల్లాల్లో కాపుల్ని ప్రభావితం చేయడానికి తోట త్రిమూర్తుల్ని క్యాబినెట్‌లోకి తీసుకున్నా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటున్నారు. దాడిశెట్టి, చెల్లుబోయినతో పాటు మరొకరి కుర్చీ కిందకు కూడా నీళ్లు వస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అదృష్టవంతుడు, అదృష్టవంతురాలు ఎవరనేది ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే లోపు బయట వస్తుందంటున్నారు. ః

IPL_Entry_Point

టాపిక్