Kanna Resignation : బీజేపీకి కన్నా గుడ్‌ బై…. టీడీపీలో చేరనున్న కన్నా….?-bjp ex president kanna lakshmi narayana quits bjp may join in telugu desam party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Ex President Kanna Lakshmi Narayana Quits Bjp May Join In Telugu Desam Party

Kanna Resignation : బీజేపీకి కన్నా గుడ్‌ బై…. టీడీపీలో చేరనున్న కన్నా….?

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 11:53 AM IST

Kanna Resignation బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడుతున్నారు. బీజేపీ నాయకత్వంతో పొసగకపోవడంతో పార్టీని వీడాలని కన్నా నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి గత నెలాఖర్లోనే కన్నా బీజేపీని వీడి జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా బీజేపీ కేంద్ర నాయకత్వం బుజ్జగించడంతో ఆయన వెనకడుగు వేశారు. పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం చక్కబడకపోవడం, పార్టీలో తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో కన్నా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

బీజేపీకి గుడ్‌బై చెప్పేసిన కన్నా
బీజేపీకి గుడ్‌బై చెప్పేసిన కన్నా

Kanna Quits ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడారు. బీజేపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అనుచరులు గత కొంత కాలంగా చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో తలెత్తిన విభేదాలు ఇప్పట్లో సర్దుకునే పరిస్థితులు లేకపోవడంతో కన్నా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Bye Bye BJP ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీని విడిచిపెట్టారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పొసగకపోవడం, పరిస్థితులు మారే అవకాశాలు లేకపోవడంతో కన్నా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. గత కొద్ది నెలలుగా సాగుతున్నసస్పెన్స్‌కు తెర పడింది. గత నెల 26వ తేదీన కన్నా జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో అది వాయిదా పడింది.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏ మాత్రం సరిపోవడం లేదు. కన్నా, గతంలో జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరపడంపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాకు వెళ్లిన కన్నాను, కాకినాడ జిల్లా బీజేపీ నేతలు కలవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలో కన్నా ప్రస్తావన తీసుకు వస్తేనే ఇటీవల కొంతకాలంగా సోము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోము వీర్రాజు వైఖరి వల్లే ఏపీలో బీజేపీకి జనసేన దూరమైందని కన్నా ఆరోపించారు. బీజేపీని దగ్గరకు రాకుండా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. గత నెలలో పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల నుంచి కన్నా వర్గీయులను సోము తొలగించారు.

తనతో మాట మాత్రం చెప్పకుండా తాను అధ్యక్షుడిగా నియమించిన వారిని పార్టీ పదవుల నుంచి సోము వీర్రాజు తొలగించారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏ మాత్రం స్పందించని సోము వీర్రాజు అన్ని జిల్లాల్లో తన మనుషుల్ని నియమించుకున్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న కన్నా రాజకీయంగాాాాాాాాాాాాాాాా తన దారి తాను చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా తప్పటడుగులు వేశారు. గతంలో ఓసారి వైసీపీలోకి వెళతారని విస్తృత ప్రచారం జరిగినా రకరకాల కారణాలతో అది నెరవేరలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాక్టివ్‌గానే వ్యవహరించినా అనూహ్యంగా ఆయన స్థానంలో సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావనలో కన్నా ఉండిపోయారు.

పార్టీ కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల జరుగుతున్న సమయంలోనే కన్నాబీజేపీని వీడాలని భావించారు. ఆ సమయంలో బీజేపీ కేంద్ర నాయకుడు స్వయంగా వచ్చి చర్చలు జరపడంతో పక్షం రోజులు జాప్యం జరిగింది. చర్చల తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోకవడంతోనే రాజీనామా చేయాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు చెప్పారు.

రాజకీయ భవితవ్యంపై అనుచరులు, అభిమానులతో కన్నా సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు కన్నా ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠ రేపుతోంది. జనసేనలో చేరుతారని మొదట ప్రచారం జరిగినా తాజా పరిణామాల నేపథ్యంలో కన్నా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. జనసేన కంటే టీడీపీలోనే భవిష్యత్తు ఉంటుందనే భావనకు కన్నా వచ్చినట్లు అభిమానులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కన్నా లక్ష్మీనారాయణ 2014,19 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో తన దారి తాను చూసుకోవాలనే ఆలోచనకు కన్నా వచ్చినట్లు కనిపిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్