CM Jagan InVisakha : ఏపీ ప్రయోజనాలే మా అజెండా....సిఎం జగన్మోహన్ రెడ్డి…
CM Jagan InVisakha ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. విభజన హామీలతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సిఎం పట్టించుకోవడం లేదనే విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీతో అంటకాగుతున్నారనే విమర్శలకు బహిరంగ వేదిక నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు.
CM Jagan InVisakha విశాఖపట్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్ళుగా కేంద్రంతో కలిసి సాగుతుండటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కలేదనే విమర్శలకు వివరణ ఇచ్చినట్లైంది. ముఖ్యమంత్రి ప్రసంగాల్లో సహజమైన శైలికి భిన్నంగా తన వాణిని ప్రధానికి గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను వివరిస్తూనే, తమ అవసరాన్ని, భవిష్యత్ రాజకీయ అవసరాలను పరోక్షంగా ప్రధానికి తెలిపేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.
మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదని, ఉండదు, ఉండబోదని సిఎం స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. ప్రధాని మరింత పెద్ద మనసు చూపితే, అలా చూపించే ఆ పెద్ద మనసును, చేసే ఆ మంచిని కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.
"రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానీ, ఇంతకముందు పలు సందర్భాలలో కానివ్వండి.. విభజనకు సంబంధించిన హామీల దగ్గర నుంచి.. పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు... ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనుసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.
చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోందని, మరోవైపు జనసముద్రం కనిపిస్తోందని, కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి ఈరోజు జనకెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోందని చెప్పారు.
దాదాపుగా రూ.10,742 కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు, ఆశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో పిల్లల చదువులు కోసం, వైద్య ఆరోగ్యం, రైతులు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన, ఈ రెండింటి వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలనతో మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు చెప్పారు..
ఒక రాష్ట్ర ప్రభుత్వంగా శక్తిమేరకు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదని, మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా, ప్రధాని సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి, మా రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పారు.
కేంద్రంతో రాజకీయాలకతీతమైన అనుబంధం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేవారు. మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచి అయినా కూడా.. ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం అని సిఎం ప్రకటించారు.