YS Jagan : చంపేసి నివాళి డ్రామాలు చంద్రబాబుకే సొంతం…. సిఎం జగన్-ap cm jagan mohan reddy slams tdp president chandra babu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : చంపేసి నివాళి డ్రామాలు చంద్రబాబుకే సొంతం…. సిఎం జగన్

YS Jagan : చంపేసి నివాళి డ్రామాలు చంద్రబాబుకే సొంతం…. సిఎం జగన్

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 01:28 PM IST

YS Jagan రాష్ట్రంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలను ప్రజలంతా గమనించాలని ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హయంలో పెన్షన్లను ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తే, తమ ప్రభుత్వం కులం, మతం, వర్గం, పార్టీలతో సంబంధం లేకుండా పెన్షన్లను చెల్లిస్తున్నట్లు సిఎం చెప్పారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

YS Jagan మనుషుల్ని పొట్టన పెట్టుకుని మళ్లీ వారికి సంతాపం తెలిపే నైజం చంద్రబాబు నాయుడికే సొంతమని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.ఫోటో షూట్‌, డ్రోన్‌ షాట్స్‌ కోసం రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 29మందిని పొట్టనపెట్టుకున్నాడని ఆరోపించారు. తెరవకూడని గేటు నుంచి లోపలకు వెళ్లి షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసి, వేలమందిని లోపలకు పంపి 29మంది ప్రాణాలు బలి తీసుకున్నాడని జగన్ ఆరోపించారు.

కందుకూరులో చంద్రబాబు సభకు జనం తక్కువ వచ్చేసరికి ఎక్కువ మంది వచ్చినట్లు చూపేందుకు ఇరుకు రోడ్డులోకి వెళ్లి ఎనిమిది మందిని చంపేశారని ఆరోపించారు. డ్రోన్‌షాట్స్‌ కోసమే ఎనిమిది ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. ఆస్పత్రి నుంచి ఐదు నిమిషాల్లోనే వెనక్కి వచ్చి మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారని, దారుణమైన రాజకీయాలు జరుగుతున్నా పత్రికల్లో రాయరని, చంద్రబాబు దత్తపుత్రుడు ప్రశ్నించడని మండి పడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెన్షన్ లబ్దిదారులతో సిఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.. పెన్షన్ల పెంపుతో అవ్వతాతలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న పెంపుదల వర్తించనుందని చెప్పారు.అవ్వాతాతలకు మాత్రమే కాకుండా వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిాళలు, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులకు కూడా పెన్షన్ పెంపుదల వర్తిస్తుందని సిఎం చెప్పారు.

క్యాలెండర్ మార్చడమే కాకుండా ఏపీలో 64లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు నింపడానికి ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుట్టుకతో వికలాంగులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు, డయాలిసిస్ రోగులు, తలసేమియా, బోదకాలు వ్యాధిగ్రసతులు, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, గుండె, కాలేయం ట్రాన్స్ ప్లాంటేషన్‌ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.

రూ.2750 రుపాయల నుంచి రూ.పదివేల వరకు పెన్షన్లు రాష్ట్రంలో చెల్లిస్తున్నట్లు సిఎం చెప్పారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు అంద చేస్తున్నట్లు ప్రకటించారు. జులై -డిసెంబర్ మధ్య కాలంలో అర్హులైన వారికి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్ స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని, ప్రస్తుతం ఏపీలో 1, 45,88,539 రేషన్ కార్డులు ఉన్నాయని, 14,401 కొత్త ఆరోగ్య శ్రీ కార్డులతో కలిపి రాష్ట్రంలో 1,41,48,249కు చేరాయన్నారు.

14,531 ఇళ్ల పట్టాలను గత ఆర్నెల్ల వ్యవధిలో మంజూరు చేశారని వాటితో కలిపి మొత్తం 30,29,171 మంది ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సదా రుణపడి ఉంటానని చెప్పారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం వెయ్యి మాత్రమే పెన్షన్ ఇచ్చేదన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేల రుపాయలకు పెన్షన్లు పెంచిందని విమర్శించారు. 2019 ఎన్నికలకు ఆర్నెల్లకు ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్లు చెల్లించారని ఇప్పుడు పెన్షన్ల సంఖ్య 64లక్షలకు చేరిందన్నారు.

IPL_Entry_Point

టాపిక్