Ys Jagan Meets PM Modi : విభజన హామీలు నెరవేర్చండి…. ప్రధానికి జగన్ వినతి-ap cm jagan mohan reddy meets prime ministrer modi and requests for special status and polavarm funds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Meets Pm Modi : విభజన హామీలు నెరవేర్చండి…. ప్రధానికి జగన్ వినతి

Ys Jagan Meets PM Modi : విభజన హామీలు నెరవేర్చండి…. ప్రధానికి జగన్ వినతి

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 02:19 PM IST

Ys Jagan Meets PM Modi ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. విభజన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు అంశాలను పరిష్కరించాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. దాదాపు 45నిమిషాల పాటు ప్రధానితో జగన్ భేటీ కొనసాగింది.

ప్రదాని మోదీకి జ్ఞాపిక బహుకరిస్తున్న  సిఎం జగన్మోహ్ రెడ్డి
ప్రదాని మోదీకి జ్ఞాపిక బహుకరిస్తున్న సిఎం జగన్మోహ్ రెడ్డి

Ys Jagan Meets PM Modi ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉందని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.

గతంలో పరిమితికి మించి రుణాలు….

గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోందని, కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ముఖ్యమంత్రి ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకపోయినా గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోందని వివరించారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని, ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశంకూడా ఇంకా పెండింగులోనే ఉందని, మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తు చేశారు.

డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేసిన జగన్మోహన్‌ రెడ్డి, దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారని వివరించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతుందని ప్రధానికి వివరించారు సీఎం. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరారు.

ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని, దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు. ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సిఎం వివరించారు. ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని ప్రధానికి వివరించారుు. డబ్బు మంజూరు చేస్తే భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్‌కోకు ఈ బకాయిలు చాలా అవసరమని వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించారు. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని పీఎంకు వివరించారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవసరమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం కోరారు.

రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం, పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.

IPL_Entry_Point