Chalo Vijayawada: చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్ వాడీలు..-anganvadis called for chalo vijayawda to cancel go no 1 and police arrests continues in the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Anganvadis Called For Chalo Vijayawda To Cancel Go No 1 And Police Arrests Continues In The State

Chalo Vijayawada: చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్ వాడీలు..

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 06:17 AM IST

Chalo Vijayawada: సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌ వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేస్తు్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్ని అడ్డుకోవడానికి ముందస్తు అరెస్ట్‌లు చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు అంగన్ వాడీ నాయకుల్ని పలు ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీకాకుళంలొ అదుపులోకి తీసుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు
శ్రీకాకుళంలొ అదుపులోకి తీసుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు

Chalo Vijayawada: అంగన్‌వాడీలు ఆంధ్రప్రదేశ‌‌లో సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల్ని నిర్బంధిస్తున్నారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులను అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కొందరు నాయకుల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరికి సిఆర్‌పిసి 149 కింద నోటీసులు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ సోమవారం విజయవాడలో మహాధర్నాకు అంగన్‌వాడీలు సిద్ధమవ్వడంతో దానిని భగం చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు. అంగన్‌ వాడీలకు నోటీసులు ఇవ్వడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. జిఓ నెంబరు 1కి వ్యతిరేకంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన పౌరహక్కుల సంఘాల నాయకులు ముప్పాళ్ల సుబ్బారావుతో సహా కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు. మంగళగిరి, తాడేపల్లిలో సిపిఎం నాయకులనూ అరెస్టు చేశారని పేర్కొన్నారు.

న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి విజయవాడ బయలుదేరుతున్న కాటికాపర్లు, శ్మశానకార్మికులనూ అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్పను నిరోధించారని వివరించారు. ముఖ్యమంత్రి తిరువూరు పర్యటన సందర్భంగా ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో అనేక మందిని అక్రమంగా అరెస్టు చేశారని, చనిపోయిన వారి బంధువులను పలకరించడానికి వెళ్తున్న వారినీ అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు స్వస్తి చెప్పి ప్రజల వాక్కును వినాలని కోరారు. శాసనమండలి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకుండా నిరంకుశ పద్ధతులతో ప్రజాగళాన్ని అణచివేయాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని, నోటీసులను ఉపసంహరించుకోవాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు.

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అరెస్టులతో ఆపాలనే ప్రభుత్వ చర్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. శాంతియుత ఉద్యమంపై పోలీసులతో ఉక్కుపాదం మోపడం తగదని, జిఓ నెంబరు 1ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.

అటు విజయనగరంలో జిల్లాలో 91 మంది అంగన్‌వాడీలను, పలువురు సిఐటియు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిని బొబ్బిలి, బాడంగి, విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పలువురు సిఐటియు, అంగన్‌వాడీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చిప్పగిరి మండలంలో అంగన్‌వాడీ వర్కర్లను గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతి జిల్లా పుత్తూరులో బస్సులో విజయవాడ బయలుదేరిన అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారికి కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రేష్మాను పోలీసులు అరెస్టు చేశారు.

చలో విజయవాడకు వెళ్తే చర్యలు తీసుకుంటామంటూ పలు జిల్లాలలోని అంగన్‌వాడీలకు సెక్షన్‌ 149 సిఆర్‌పిసి కింద నోటీసులు అందించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, పల్నాడు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు అంగన్‌వాడీలు, సిఐటియు, ఐద్వా నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు. ఈ జిల్లాల్లో పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు.

IPL_Entry_Point