High court On Volunteers : అర్హుల ఎంపిక వాలంటీర్లతోనా..? హైకోర్టు ఆగ్రహం-andhra pradesh high court raises questions on volunteers functioning and selection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Raises Questions On Volunteers Functioning And Selection

High court On Volunteers : అర్హుల ఎంపిక వాలంటీర్లతోనా..? హైకోర్టు ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 05:38 AM IST

High court On Volunteers ఆంధ్రప్రదే‌శ్‌లో సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని హైకోర్టు ప్రశ‌్నించింది. గతంలో ప్రభుత్వ అధికారులు అర్హులైన వారిని ఎంపిక చేసే వారని, వారిపై విశ్వాసం లేక వాలంటీర్లకు ఆ బాధ్యతలను అప్పగించారా అని హైకోర్టు ప్రశ్నించింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

High court On Volunteers ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని నిలదీసింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లలో అప్‌లోడ్‌ చేయడం గోప్యతకు భంగం కలిగించదా అంటూ సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.రాజకీయ కారణాలతో తమను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణకు హాజరైన సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.

ట్రెండింగ్ వార్తలు

'ఏపీలో 'లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని హైకోర్టు నిలదీసింది. గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అని, వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సంక్షేమ పథకాల అమలుకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు.. వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్ధమైందని పేర్కొంది. వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని సూచించింది. శాశ్వత ఉద్యోగులుగా నియమించి వారికి సైతం సర్వీసు రూల్స్‌ పాటించాలని పేర్కొంది. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇంతియాజ్‌ను ఆదేశించిన న్యాయమూర్తి.. విచారణను మార్చి 10కి వాయిదా వేశారు.

ప్రభుత్వ విధులు, సేవ ఎలా అవుతుంది…?

వృద్ధులను ఆసుపత్రికి తీసుకెళ్ల్లడం, చిన్న పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడం సేవ అవుతుందని, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అర్హతలను నిర్ణయించడం సేవ ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌వోలు చేయాల్సిన పనిని వాలంటీర్లు చేయడం సామాజిక సేవ అనిపించుకోదని హైకోర్టు అభిప్రాయపడింది.

సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, వారి అర్హతలను నిర్ణయించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్ధిదారుల ఎంపికకు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉన్నారని, వారిని కాదని వాలంటీర్లకు ఆ బాధ్యతను ఎలా అప్పగిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో ఇంతియాజ్‌ను నిలదీసింది.

సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలుచేయలేదా అని ప్రశ్నించిన ధర్మాసనం అప్పట్లో ప్రభుత్వాధికారులే లబ్ధిదారులను ఎంపిక చేయలేదా?' అని ప్రశ్నించింది. అధికారులపై విశ్వాసం లేక వాలంటీర్లకు ఆ బాధ్యతను అప్పగించారా.. లేకుంటే ప్రభుత్వ అధికారులు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ లేరని భావిస్తున్నారా అని ప్రశ్నించింది.

వ్యక్తిగత గోప్యతకు భంగం…?

ప్రజల సమాచారాన్ని ప్రభుత్వ యాప్‌లలో పొందుపరిచే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆధార్‌, తదితర వివరాలను యాప్‌లలో పొందుపరిస్తే లబ్ధిదారుల వ్యక్తిగత గోప్యత పరిస్థితేంటని ఆందోళన వ్యక్తంచేసింది. సామాజిక సేవ కోసం వాలంటీర్లను నియమించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. పథకాల లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతలను నిర్ణయించే అధికారాన్ని వారికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది.

సంక్షేమ పథకాలకు, వాలంటీర్ల నియామకానికి తాము వ్యతిరేకం కాదని, చట్టం అనుమతిస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని వ్యాఖ్యానించింది. రూ.5వేలు చెల్లించి వాలంటీర్లను ప్రభుత్వం దోపిడీకి గురిచేస్తోందని పేర్కొంది. లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్రపై అభ్యంతరం ఉందని తెలిపింది. ఈ సందేహాలతో పాటు, వాలంటీర్ల ద్వారా పౌరుల సమాచారాన్ని సేకరించడం ద్వారా గోప్యత హక్కుకు ఎలా భద్రత కల్పిస్తున్నారో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొందామని, రాజకీయ కారణాలతో తమను తొలగించారంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన ఆర్‌.వసంతలక్ష్మి, మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు 28న కోర్టుకు హాజరుకావాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించారు. దీంతో హైకోర్టు విచారణకు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ హాజరయ్యారు.

ఇంటింటికీ సర్వేచేసి సంక్షేమ పథకాల అర్హులను వాలంటీర్లు గుర్తించి, దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. 'దరఖాస్తులు స్వీకరించడానికి వాలంటీర్లు ఎవరు? వాళ్లేమైనా ప్రభుత్వాధికారులా? వాళ్లకేమైనా సర్వీసు నిబంధనలున్నాయా?' అని ప్రశ్నించారు. సామాజికసేవ కోసం నియమించామని ఇంతియాజ్‌ బదులివ్వగా.. అలాగైతే లబ్ధిదారుల అర్హతలు, ఎంపికను నిర్ణయించే ముఖ్యమైన పనిని ఎందుకు అప్పగిస్తున్నారని నిలదీశారు.

ప్రభుత్వ శాఖలు రద్దయ్యాయా…?

లబ్ధిదారుల ఎంపిక విషయంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన ప్రామాణిక పద్ధతిని పాటిస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ముఖ్య కార్యదర్శిని కోర్టుకు పిలిపించి వివరణ కోరుతామని హెచ్చరించారు. గతంలోనూ అధికారులే లబ్ధిదారులను ఎంపిక చేసేవారని గుర్తుచేశారు. ఆ పనిని ఇప్పుడు వాలంటీర్ల ద్వారా చేయిస్తున్నారంటే .. ప్రభుత్వ శాఖలను రద్దు చేశారా అని ప్రశ్నించారు. వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలంటే వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలన్నారు.

వాలంటీర్ల నియామకానికి సర్వీసు నిబంధనలు ఏమీ లేవని, ప్రభుత్వ విధులను వారి చేతుల్లో ఎలా పెడతారని.. సలహాదారుల నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో విచారణ సందర్భంగా హైకోర్టు సీజే వ్యాఖ్యానించారని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలు వాలంటీర్ల విషయంలోనూ వర్తిస్తాయన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌, వెల్ఫేర్‌ సహాయకులు మాత్రమే యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తారన్నారు. ఈ విషయంలో వాలంటీర్ల పాత్ర లేదన్నారు. వారు డేటాను మాత్రమే సేకరిస్తారన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

IPL_Entry_Point