CBSE Pattern Exams : ఇక సిబిఎస్‌ఇ పద్థతిలోనే పరీక్షలు….2025లో తొలిబ్యాచ్-andhra pradesh government adopts cbse pattern examinations from 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbse Pattern Exams : ఇక సిబిఎస్‌ఇ పద్థతిలోనే పరీక్షలు….2025లో తొలిబ్యాచ్

CBSE Pattern Exams : ఇక సిబిఎస్‌ఇ పద్థతిలోనే పరీక్షలు….2025లో తొలిబ్యాచ్

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 07:20 AM IST

CBSE Pattern Exams CBSE PatternEXams : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ గుర్తింపుకు పరిధిలోకి తీసుకు వెళుతుండటంతో 2025 నుంచి విద్యార్ధులు సిబిఎస్‌ఇ పద్ధతిలో పదోతరగతిపరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులు తొలి బ్యాచ్‌గా 2025లో సిబిఎస్‌ఇ పద్ధతిలో పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ‌‌లో 1092 పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరంలో సిబిఎస్‌ఇ గుర్తింపు రానుంది. సీబీఎస్‌ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న స్కూళ్లకు దశల వారీగా గుర్తింపు లభించనుంది. సీబీఎస్‌ఈగా గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్ధులు నేరుగా సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఏపీలో సీబీఎస్‌ఈ తరహాలో పది పరీక్షలు
ఏపీలో సీబీఎస్‌ఈ తరహాలో పది పరీక్షలు (HT_PRINT)

CBSE PatternEXams ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగ సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌‌ను పాఠ్యాంశాల్లో విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 8 చదువుతున్న విద్యార్ధులు 2025 నాటికి సీబీఎస్‌ఈ తొలి బ్యాచ్‌గా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపై ఇదే విధానం కొనసాగనుంది. సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న స్కూళ్లకు ఆ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. మిగిలిన విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు ద్వారా అదే ప్యాట్రన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు ఇంటర్నల్ మార్కులు కూడా కేటాయిస్తారు.

ఏపీలో 2025 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. 2025 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు అమల్లోకి వచ్చాయి.

ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ తరహాలోనే పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని తెలుగు-ఇంగ్లీష్ రెండు భాషల్లో ముద్రించారు. తొలి బ్యాచ్‌ విద్యార్థులు 2025లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను రాయనున్నారు. ఈ ఏడాది సిబిఎస్‌ఈ గుర్తింపు వచ్చిన పాఠశాలల్లో చదివే విద్యార్ధులు బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

2025 నుంచి విద్యార్ధులు అదే తరహా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే చదువుతున్న వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆ తరువాత నుంచి పూర్తిగా సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి.

ఇంటర్నల్ మార్కులు ఉండాల్సిందే....

ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు అవకాశం ఉండదు. తుది పరీక్షలు నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు ఇంటర్నల్ మార్కుల విషయంలో అక్రమాలకు పాల్పడుతుండటంతో వాటిని రద్దు చేశారు. వార్షిక పరీక్షలను పూర్తిగా 100మార్కులకు నిర్వహిస్తున్నారు.

సీబీఎస్‌ఈ విధానానం అమల్లోకి రావడంతో 2025 నుంచి జరిగే టెన్త్‌ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు. గత ఏడాది 6.22 లక్షల మంది విద్యార్ధులు పది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో సీబీఎస్‌ఇ విద్యా విధానాన్ని అమలు చేస్తుండటంతో పరీక్షలు కూడా అదే తరహాలో నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ బోర్డు గుర్తింపు లేని పాఠశాలలకు ఎస్సెస్సీ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్ని మాత్రం సీబీఎస్‌ఈ పద్ధతిలోనే జరుగుతాయి.

IPL_Entry_Point