GIS Summit 2023 : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్.. ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు-andhra pradesh gets rupees 13 lakh crore investments through gis summit 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Gets Rupees 13 Lakh Crore Investments Through Gis Summit 2023

GIS Summit 2023 : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్.. ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 05:01 PM IST

GIS Summit 2023 : విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు విజయవంతమైంది. ప్రతిష్టాత్మక సంస్థలు పాల్గొన్న ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సీఎం జగన్ వెల్లడించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం

GIS Summit 2023 : విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమైంది. సమ్మిట్ తొలి రోజు 92 ఎంవోయూలు కుదరగా.. వీటి విలువ రూ. 11. 87 లక్షల కోట్లని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండో రోజు సమ్మిట్ లో... రూ. 1.17 లక్షల కోట్ల విలువైన మరో 260 అవగాహన ఒప్పందాలు జరిగాయి. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా... విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గత మూడున్నరేళ్లలో ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేస్తోందని చెప్పారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.... కోవిడ్‌ కష్టాలను కూడా అధిగమించామని పేర్కొన్నారు. కీలక సమయంలో జీఐఎస్‌ నిర్వహించామని... పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు.

జీఐఎస్‌ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని సీఎం జగన్ వివరించారు. వీటి ద్వారా దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయని... గ్రీన్‌ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకమని వ్యాఖ్యానించారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని పేర్కొన్నారు.

జీఐఎస్ సమ్మిట్ లో.... వ్యవసాయ శాఖ తరపున రూ. 1160 కోట్ల విలువైన 15 అవగాహన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో 3750 మందికి ఉపాధి కల్పించే రూ. 1,020 కోట్ల విలువైన 8 అవగాహన ఒప్పందాలపై పశుసంవర్థక శాఖ సంతకాలు చేసింది. రాష్ట్రంలో 30,000 మందికి పైగా ఉపాధి కల్పించే రూ. 22,096 కోట్ల విలువైన 117 అవగాహన ఒప్పందాలు పర్యాటక శాఖ తరపున జరిగాయి. ఇంధన శాఖ నుంచి రూ. 8,84,823 కోట్ల విలువైన 40 అవగాహన ఒప్పందాలను కుదిరాయి. దీని ద్వారా 2 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

పెట్టుబడులను ఆకర్షించిన రంగాలలో.... ఇంధన, పరిశ్రమలు - వాణిజ్యం, ఐటి - ఐటిఈఎస్, పర్యాటక, వ్యవసాయం - పశుసంవర్ధక శాఖలు ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారులలో, రిలయన్స్ రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది, దీని ద్వారా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రూ. 2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. JSW గ్రూప్ 9,500 మందికి ఉపాధి కల్పించే రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.20 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధిని కల్పించనుంది. అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి లభించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ తో రూ. 9,300 కోట్ల పెట్టుబడితో 2, 850 మందికి ఉపాధి కల్పించే 2 ఎంఓయూలు కుదిరాయి. జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

IPL_Entry_Point