APSRTC New Buses : ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలుకు సిఎం గ్రీన్ సిగ్నల్
APSRTC New Buses ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఏపీలో ఆర్టీసీ సేవల్ని బలోపేతం చేయడానికి 2736 కొత్త బస్సుల్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.
APSRTC New Buses ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంస్థ సేవల్ని విస్తరించేందుకు భారీగా సొంత బస్సులు కొనుగోలుకు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2736 కొత్త బస్సులు కొనుగోలుకు సీఎం జగన్ అమోద ముద్ర వేసినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.
రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసి ఎండీ తెలిపారు. జీసీసీ మోడల్‌లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నట్లు ప్రకటించారు. కర్ణాటక తరహాలో 15 మీటర్ల పొడవు ఉండే బస్సుల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు ఉంటాయని ప్రకటించారు.
కొత్తగా కొనుగోలు చేసే 1,500 డీజిల్ బస్సులు నేరుగా ఆర్టీసీ కొనుగోలు చేయనున్నామని, 1,000 విద్యుత్తు బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు చెప్పారు 200 పాత డీజిల్ బస్సులను ప్రయోగాత్మకంగా విద్యుత్తు రెట్రోఫిటింగ్ విద్యుత్తు బస్సులుగా మార్పు చేస్తామన్నారు. మిగిలిన 36 అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
రెట్రోఫిటింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని వెల్లడించారు. కర్ణాటక ఆర్టీసీ అంబారీ ఉత్సవ్ పేరిట 15 మీటర్ల పొడవుంటే బస్సులను ఇటీవల ప్రవేశపెట్టిందని, ఏపీఎస్‌ఆర్టీసీకి కూడా అటువంటివి తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.572 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా ఆర్టీసీలతో అంతర్రాష్ట్ర ఒప్పందం పూర్తయిందని, త్వరలో తెలంగాణ, తమిళనాడు ఆర్టీసీలతో కూడా ఒప్పందాలు చేసుకొని, ఏ రాష్ట్రంలో ఎన్ని కి.మీ. మేర తిరగొచ్చు అనేది తేలాక బస్సుల సంఖ్య పెంచుతామని ఎండీ వివరించారు.
పొరుగు రాష్ట్రాల డీజిల్ వినియోగంపై దర్యాప్తు…
ఆర్టీసీ ఏటా 150 కోట్ల కి.మీ.మేర బస్సులు నడుపుతూ 27 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆయిల్ కంపెనీలనుంచి బల్క్‌గా కొంటోందని ఆర్టీసి ఎండీ చెప్పారు. మూడేళ్లకోసారి టెండరు నిర్వహించి ఎక్కువ రాయితీనిచ్చిన ఆయిల్ కంపెనీలనుంచి డీజిల్ తీసుకుంటున్నట్లు చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో రిటైల్‌బంకుల్లో ధరకంటే బల్క్ ధర పెరిగి లీటరుపై రూ.20 వ్యత్యాసం రావడంతో స్థానికంగా రిటైల్ బంకుల నుంచి కొనుగోళ్లకు ఆదేశాలిచ్చామని వివరించారు. ప్రస్తుతం ధరలో తేడా లేకపోవడంతో ఈనెల 1 నుంచి మళ్లీ ఆయిల్ కంపెనీలనుంచి నేరుగా డీజిల్ తీసుకునేలా ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
ఆంధ్రాకు పొరుగు రాష్ట్రాల్లో ధర తక్కువ ఉండటంతో పక్క రాష్ట్రాలనుంచి డీజిల్ తెచ్చి ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారని రాష్ట్ర జీఎస్టీ, వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఆర్టీసి దృష్టికి తెచ్చారని అందుకే ఏపీలో ఉంటూ రాష్ట్రానికి అన్ని పన్నులు చెల్లించే బంకులనుంచే డీజిల్ తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. కొందరు బంకుల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడటంతో బంకు ఏపీలో ఉండటంతో పాటు, సరఫరాదారూ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలనే నిబంధన విధించినట్లు చెప్పారు. 'గుంతకల్లులో డీజిల్ దందా' అని ఇటీవల పత్రికల్లో రావడంతో నిశితంగా పరిశీలించి సరిచేసేందుకు ప్రయత్నించామన్నారు.