Paddy Cultivation : అంతా వరి సాగుచేస్తే కష్టమే….మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి-andhra pradesh agriculture minister comments on paddy cultiveation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Agriculture Minister Comments On Paddy Cultiveation

Paddy Cultivation : అంతా వరి సాగుచేస్తే కష్టమే….మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 02:02 PM IST

Paddy Cultivation రైతులంతా వరి సాగుచేస్తే దానిని సేకరించడం కూడా కష్టమవుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రత్యామ్నయ పంటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వరితో పాటు ఇతర పంటల సాగుపై కూడా రైతులు దృష్టి పెట్టాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

Paddy Cultivation వ్యవసాయంలో వరి పండించిన వారే రైతు అనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురిసి, సీజన్‌కు తగినట్లుగా సాగునీరు సరఫరా చేస్తుండటంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తితో పాటు ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫాంలో అగ్రిటెక్‌ సదస్సును మంత్రి ప్రారంభించారు.

వ్యవసాయ ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, సాంకేతికత, నూతన వంగడాలను ప్రదర్శనలో పెట్టడంతో రైతులకు ఉపయోగపడతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన వరి, మొక్కజొన్న వంగడాలు దేశంలో 75 శాతం మంది రైతులు వినియోగిస్తున్నారని, దీనికి కారకులైన శాస్త్రవేత్తలను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పత్తి సాగు తగ్గిపోవడంతో తెలంగాణ నుంచి ముడి సరకు దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల రాష్ట్రం జీఎస్టీ కోల్పోతోందని అన్నారు. వరితో పాటు పత్తి సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు.

రాష్ట్రంలో పుష్కలంగా నీరు లభిస్తున్నందున వరి మాత్రమే కాకుండా ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతి ఇస్తోందని మార్కెట్ అవసరాలు, డిమాండ్‌కు తగిన విధంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులకు రైతులు సిద్ధమవ్వాలని మంత్రి సూచించారు.

రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ చదవడంతో ఉద్యోగాలు ఇప్పించాలంటూ వారి తల్లిదండ్రులు మంత్రులకు వినతిపత్రాలు ఇస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ చిన్న పని కూడా చేయలేకపోయారంటూ తమను నిష్ఠూరమాడుతున్నారని చెప్పారు.

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించి 10 పంటల్లో సేద్యం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే 30 వేల ఎకరాల్లో డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారని వివరించారు.

IPL_Entry_Point

టాపిక్