Amma Vodi Scheme : అమ్మ ఒడి పథకం అర్హతలేంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?-amma vodi scheme application process eligibility criteria ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amma Vodi Scheme Application Process Eligibility Criteria

Amma Vodi Scheme : అమ్మ ఒడి పథకం అర్హతలేంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

Praveen Kumar Lenkala HT Telugu
Nov 15, 2021 03:10 PM IST

Amma vodi scheme: అమ్మ ఒడి పథకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి 2020 జనవరి 9న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభించారు.

విద్యార్థుల చదువులకు భరోసా అమ్మ ఒడి పథకం (ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థుల చదువులకు భరోసా అమ్మ ఒడి పథకం (ప్రతీకాత్మక చిత్రం) (YSR Congress official website)

Amma vodi scheme details in telugu: అమ్మ ఒడి పథకం బడి వయస్సు పిల్లలు డ్రాపవుట్‌గా మారకుండా వారి చదువులను ప్రోత్సహించేలా దోహదపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ పథకం కింద రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ప్రతి ఏటా జనవరిలో విద్యార్థి తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తారు. 

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. ప్రయివేటు పాఠశాల అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా ఈ పథకం వర్తిస్తుంది.

9వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు నగదు బదిలీకి బదులు లాప్ టాప్ పొందే సౌకర్యాన్ని కల్పించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యేలా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.

అమ్మ ఒడికి అర్హతలివీ.. (Amma vodi eligibility)

1. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి

2. తల్లిదండ్రులు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కలిగి ఉండాలి.

3. ప్రయివేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 75 శాతం హాజరు కలిగి ఉండాలి.

4. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.

5. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే నెలకు రూ. 5 వేల లోపు ఉండాలి. పట్టణవాసులైతే నెలకు రూ. 6,250 మించరాదు.

6. ఐదు ఎకరాల లోపు మెట్ట భూమి లేదా రెండున్నర ఎకరాల మాగాణికి మించి ఉండరాదు.

7. విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లకు మించరాదు.

8. స్థిరాస్తి పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు మించరాదు.

9. విద్యార్థులు మధ్యలో బడి మానేస్తే తదుపరి అమ్మ ఒడి పథకం వర్తించదు.

10. పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకూ ఈ పథకం వర్తిస్తుంది.

వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల మౌలిక వసతులకు..

జగనన్న అమ్మ ఒడి పథకం (Amma vodi scheme) ద్వారా ఏటా ఇచ్చే రూ. 15 వేలల్లో ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలను పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్వహణ కోసం వెచ్చిస్తోంది. 

అంటే రూ. 14 వేలు మాత్రమే తల్లి ఖాతాలో జమ చేస్తుంది. ఈ వెయ్యి రూపాయలను టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్‌లో జమ చేస్తుంది.

పాఠశాలలకు వెళ్లకుండా పిల్లలు బడి మానేయడం వెనక ప్రధాన కారణం టాయిలెట్ వసతి లేకపోవడమేనని గుర్తించిన ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీలుగా ఈ చర్య చేపట్టింది.

పాఠశాల అభివృద్ధి కమిటీ ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మాత్రమే ఈ నిధులను ఖర్చు చేస్తారు.

పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే విద్యార్థులు 1902 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.

బడి మానేస్తే తెలిసిపోతుంది.

అమ్మ ఒడి పథకం పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా విద్యార్థి పాఠశాలకు రానిపక్షంలో వెంటనే తల్లిదండ్రులకు తెలిసేలా గైర్హాజరైన మొదటి రోజు తల్లిదండ్రుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తారు. రెండో రోజు కూడా మెసేజ్ పంపిస్తారు.

మూడో రోజు విద్యార్థి రానిపక్షంలో గ్రామ వలంటీర్‌ విద్యార్థి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుంటారు. 

ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించింది.

అమ్మ ఒడి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

https://jaganannaammavodi.ap.gov.in/AMMAVODI/ వెబ్ సైట్లో దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకుని లేదా సమీపంలోని వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయంలో దరఖాస్తు ఫారం పొందవచ్చు.

దరఖాస్తులో వివరాలన్నీ నింపాలి. అవసరమైన పత్రాలన్నీ జత చేయాలి. తిరిగి దరఖాస్తు ఫారాన్ని గ్రామ సచివాలయంలో సమర్పించాలి.

జనవరిలో అందజేసే ఈ సాయం కోసం నెల ముందుగా డిసెంబరు 10 నుంచి 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అమ్మ ఒడి (Amma vodi scheme)కి అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డు, స్కూలు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, జన్మ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, తల్లి పాస్ పోర్టు సైజు ఫోటో

IPL_Entry_Point

సంబంధిత కథనం