SC on Ap Capital: ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా-a two judge bench of the supreme court adjourned the hearing on the andhra pradesh government s petitions to july 11
Telugu News  /  Andhra Pradesh  /  A Two-judge Bench Of The Supreme Court Adjourned The Hearing On The Andhra Pradesh Government's Petitions To July 11.
సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

SC on Ap Capital: ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా

28 March 2023, 17:13 ISTHT Telugu Desk
28 March 2023, 17:13 IST

SC on Ap Capital: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో నిరాశ తప్పలేదు.రాజధాని నిర్మాణంపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సర్వోన్నత న్యాయస్థానం జులై 11కు వాయిదా వేసింది. హై కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

SC on Ap Capital: రాజధాని పిటిషన్లపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రాజధాని నిర్మాణంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రైతుల పిటిషన్లు వేశారు. రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం కోర్టును పదేపదే విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. అమరావతి పిటిషన్లపై విచారణ జరపడానికి కె.ఎం.జోసెఫ్‌ ఆసక్తి చూపించలేదు. జూన్ 16న కె.ఎం.జోసెఫ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అమరావతి పిటిషన్లపై విచారణ ముగించడం సాధ్యపడదని భావించారు. దీంతో కేకే.వేణుగోపాల్, నిరంజన్‌ రెడ్డి, నఫ్డే తదితరులు తమ వాదనలు గంటలోగా ముగిస్తామని ప్రాధేయపడిన న్యాయమూర్తి పిటిషన్లను వినడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.

మంగళవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే రాజధాని పిటిషన్లపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేయడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ పూర్తి కాకుండా మరో కేసు విచారించడం తగదన్న న్యాయమూర్తి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం అలా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 7వ నంబరు కేసు విచారణ పూర్తై 8వ నంబరు కేసును విచారిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తమ పిటిషన్‌పై విచారణ జరపాలని పదేపదే న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

విచారణ వాయిదా వేసిన ధర్మాసనం…

అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భోజన విరామం తర్వాత విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెండు పిటీషన్లను విచారించిన న్యాయమూర్తులు విచారణను జులైకు వాయిదా వేసింది.

మరోవైపు అమరావతి రాజధానిగా విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా కోర్టు విచారణ వాయిదా వేయడం ఏపీ ప్రభుత్వానికి నిరాశ కలిగించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో కోరింది. సుప్రీం కోర్టులో స్టే లభిస్తే ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను చేయొచ్చని భావించారు. విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి కోర్టు అనుమతిస్తుందని భావించినా అలా జరగలేదు.

హైకోర్టు తీర్పు వెలువరించే సమయానికి రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని.. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో అభ్యంతరం తెలిపింది. రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుందని పిటిషన్‌లో విన్నవించింది.

ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని, రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని పిటిషన్‌లో వివరించారు. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయన్నారు.

అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుందని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. మరోవైపు రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. తమతో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని పెద్ద సంఖ్యలో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని, వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదని ఏపీప్రభుత్వం చెబుతోంది. అమరావతి రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని పేర్కొన్నారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తమ పిటిషన్‌లో పేర్కొంది.

మరోవైపు అమరావతి పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ జూన్‌ నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఎంఆర్‌షా, అజయ్ రస్తోగి,దినేష్ మహేశ్వరి కూడా జూన్‌, జులై నెలల్లో పదవీ విరమణ చేయనుండటంతో ఏ బెంచ్‌ ముందుకు అమరావతి పిటిషన్లు వస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది.

టాపిక్