October 11 Telugu News Updates : ఏం చేసినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు.. రేవంత్ రెడ్డి
- మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు నగరంలో పోస్టర్లు వేవారు. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ పే అంటూ వేల సంఖ్యలో పోస్టర్లను అంటించారు. రూ.18వేల కాంట్రాక్టులు పొందారని వాటిలో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్లు మునుగోడులో అగ్గి రాజేస్తున్నాయి.
Tue, 11 Oct 202204:59 PM IST
షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
కామారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షను చేపట్టారు. పాదయాత్రలో భాగంగా నిజాంసాగర్ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వడం చేతకాలేదన్నారు.
Tue, 11 Oct 202204:57 PM IST
దిల్లీలో కేసీఆర్
బీఆర్ఎస్ ప్రకటన తర్వాత సీఎం కేసీఆర్ మెుదటిసారి దిల్లీ వెళ్లారు. పార్టీ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులపై సూచనలు చేశారు. కేసీఆర్ దిల్లీలోనే వారం రోజులు ఉంటారని సమాచారం. జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. ఎవరెవరిని కలుస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Tue, 11 Oct 202204:54 PM IST
18 లక్షల ఎకరాలను కాజేయాలని చూస్తున్నారు
కేసీఆర్ కుటుంబంపై మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్ చేశారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ చుట్టూ ఎంతో విలువైన భూములు ఉన్నాయని, సామాన్యుల నుంచి వాటిని కాజేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Tue, 11 Oct 202211:53 AM IST
ఏం చేసినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు.. రేవంత్ రెడ్డి
దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చండూరులో కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనను ఆయన ఖండించారు. రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయకుంటే ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని అన్నారు.
Tue, 11 Oct 202211:53 AM IST
ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్
ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు వెళ్లారు. ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతోపాటుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్‌కుమార్ ఉన్నారు.
Tue, 11 Oct 202207:43 AM IST
సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన సాయిరెడ్డి
విశాఖపట్నంలోని దసపల్ల భూముల వ్యవహారంలో సిబిఐ విచారణకు సిద్ధమని ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రకటించారు. దసపల్ల భూములు ప్రైవేటు భూములు కావడంతోనే సుప్రీం కోర్టు యజమానులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని చెప్పారు. 22ఏ తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని చెప్పారు. భూముల కొనుగోలు, వ్యాపార లావాదేవీల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Tue, 11 Oct 202206:29 AM IST
కేంద్రీకృత అభివృద్ధితో నష్టమన్న మార్గాని భరత్
ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుందని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని, చంద్రబాబు, ఆయన బినామీల కోసమే అమరావతి నిర్మాణం జరుగుతోందన్నారు. టీడీపీ ఆధ్వర్యంలోనే పాదయాత్ర జరుగుతోందని, అమరావతి రాజధాని కావాలనే చంద్రబాబు పవన్, లోకేశ్ హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించారు. ఐదేళ్లు పాలించిన చంద్రబాబు అమరావతికి ఏం చేశారని, ప్రజలకు పవన్ మేలు చేస్తారని ఎవరూ నమ్మడం లేదని ఎంపీ భరత్ అన్నారు.
Tue, 11 Oct 202205:29 AM IST
యూపీ బయలుదేరిన సిఎం కేసీఆర్
ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ బయలుదేరిన సీఎం కేసీఆర్. సీఎం కేసిఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Tue, 11 Oct 202205:28 AM IST
పౌర సరఫరాల సంస్థలో భారీ కుంభకోణం
నెల్లూరులోని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో భారీ కుంభకోణం జరిగింది. సంస్థ నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు మళ్లించారు. దాదాపు రూ.32 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక విచారణ అధికారిగా నెల్లూరు జేసీ కూర్మనాథ్ ను ప్రభుత్వం నియమించింది.
Tue, 11 Oct 202204:17 AM IST
ఉజ్జయినిలో అభివృద్ధి పనులు జాతికి అంకితం
నేడు మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలో అభివృద్ధి పనులు జాతికి అంకితం చేయనున్నారు. పురాతన మహాకాళేశ్వర్ ఆలయ కారిడార్ అభివృద్ధి, ప్రాజెక్టు పనులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఆలయ కారిడార్ అభివృద్ధి పనులు జాతికి అంకితం చేయనున్నారు. రూ.856 కోట్ల వ్యయంతో నిర్మించిన పనులు జాతికి అంకితం చేయనున్నారు. కారిడార్ ప్రారంభోత్సవానికి గుర్తుగా శివలింగాన్ని ఆవిష్కరించనున్నారు.
Tue, 11 Oct 202204:17 AM IST
హత్య కేసు నిందితుల అరెస్ట్
సత్యసాయి జిల్లా వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణ, వరుణ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు నేడు హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు. పార్టీలో గ్రూపు తగాదాలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా? అని మంత్రి తెలుసుకోనున్నారు.
Tue, 11 Oct 202204:17 AM IST
తణుకు నియోజకవర్గంలో హైటెన్షన్
ఏలూరు జిల్లా తణుకు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు తణుకు నియోజకవర్గంలోకి అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. దీంతో పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని మంత్రి కారుమూరి పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర కొనసాగే మార్గాల్లో వ్యతిరేక ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. పాదయాత్ర శాంతియుతంగా కొనసాగేలా పోలీసుల చర్యలు చేపట్టారు.
Tue, 11 Oct 202204:17 AM IST
రాజధాని రైతుల మహా పాదయాత్ర
రాజధాని రైతుల మహా పాదయాత్రకు నేటితో 30వ రోజుకు చేరుకుంది. పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న రైతులు ఇరగవరం మీదుగా వేల్పూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. వేల్పూరులో రాత్రి బస చేయనున్నారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర సాగనుంది.