Telugu News  /  Telangana  /  Andhrapradesh And Telanagana Telugu Live News Updates 14 November 2022

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

November 14 Telugu News Updates : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి సంస్థలో ముగిసిన సోదాలు

  • తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై లోతైన విశ్లేషణ జరగనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Mon, 14 Nov 202217:26 IST

సింగరేణిపై కేంద్రం కుట్ర

తెలంగాణలో కోల్ బ్లాక్స్ ను వేలం వేసే పనులకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని చెబుతూనే.. కోల్ బ్లాకులను వేలం వేస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా సింగరేణికి వాటిని దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దించున్నారని పేర్కొన్నారు. సింగరేణిపై కేంద్రం కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Mon, 14 Nov 202217:26 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి సంస్థలో ముగిసిన సోదాలు

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోదాలు చేశారు. 24 బృందాల్లో 150 మంది పాల్గొన్నారు. సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సీపీయూలు, హార్డ్ డిస్క్ లను మూడు వాహనాల్లో తరలించారు.

Mon, 14 Nov 202211:44 IST

పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు

తెలంగాణలో పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకనే ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడుతుందని వైఎస్​ షర్మిల ఆరోపించారు. ఆదివారం పాదయాత్రలో భాగంగా కటికనపల్లిలో ఏర్పాటు చేసుకున్న నైట్ క్యాంపు టెంట్లను అధికారులు తొలగించడం వెనక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా పని చేస్తున్నారని విమర్శించారు.

Mon, 14 Nov 202210:02 IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల బెయిల్ పిటిషన్​ సోమవారానికి వాయిదా

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్​ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్​పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది విచారణను శుక్రవారానికి వాయిదా వేయమని కోరారు. ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

Mon, 14 Nov 20229:24 IST

ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు నిరసన సెగ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు నిరసన సెగ తగిలింది. అయితే ఇక్కడ సొంతవర్గ నుంచే నిరసనలు వెల్లువెత్తాయి. వైసీపీ మరో వర్గం నల్ల జెండాలతో నిరసన తెలిపింది.

Mon, 14 Nov 20228:08 IST

వైఎస్‍ఆర్ బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు

వైఎస్‍ఆర్ బాటలో సీఎం జగన్ నడుస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు.  ఇల్లు లేని నిరుపేదలందరికీ  గూడు కల్పించాలని జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.  30 లక్షల మందికి ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని,  పేదలందరికీ శాశ్వత ప్రతిపాదికన ఇళ్లు కట్టిస్తున్నామన్నారు.  పేదల ఇళ్ల కోసం మొత్తం 71 వేల ఎకరాల భూమి సేకరించామని,  రూ.11 వేల కోట్లతో 20 వేల ఎకరాల ప్రైవేట్ భూమి కొనుగోలు చేశామని చెప్పారు. 

Mon, 14 Nov 20227:48 IST

హోల్‍టైమ్ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి  శరత్ చంద్రారెడ్డి తొలగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో అరెస్టైన హోల్‍టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని  అరబిందో ఫార్మా విధుల నుంచి తొలగించింది.  ప్రస్తుతం అరబిందో ఫార్మా లాజిస్టిక్స్, ఐటీ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న శరత్ చంద్రారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు.  లిక్కర్ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి పాత్ర కారణంగా కంపెనీ ప్రతిష్ట దెబ్బతిన్నదని  అరబిందో యాజమాన్యం భావిస్తోంది. 

Mon, 14 Nov 20227:37 IST

ఈనెల 16న రాష్ట్ర సమాచార కమీషనర్ల ప్రమాణ స్వీకారం

ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.16వతేది బుధవారం మధ్యాహ్నం 3గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Mon, 14 Nov 20226:07 IST

సూపర్‌ స్టార్‌కృష్ణాకు అస్వస్థత

సూపర్‌ స్టార్‌ కృష్ణా అస్వస్థకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో  మాదాపూర్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో కృష్ణాను చేర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. 

Mon, 14 Nov 20225:26 IST

మద్యం కుంభకోణంలో కీలక పరిణామం…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అదుపులో ఉన్న అభిషేక్ బోయిన్‍పల్లి, విజయ్‍ నాయర్‍లను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఈడీ కస్టడీలో ఉన్న శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబులతో కలిపి వారిని విచారించనుంది.  దర్యాప్తు సమయంలో శరత్‍చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఇచ్చిన సమాచారంతో అభిషేక్, విజయ్ నాయర్‍ను  ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Mon, 14 Nov 20224:40 IST

పల్నాడు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‍కు దేహశుద్ధి

పల్నాడు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‍కు దేహశుద్ధి జరిగింది.  మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలతో   విజయవాడ నుంచి వినుకొండ వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న మహిళ  నరసరావుపేటలో కుటుంబీకులతో కలిసి దాడి చేసింది. 

Mon, 14 Nov 20224:39 IST

ఆక్వా రైతులు పోరుబాట

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతు పోరు బాట పట్టారు.   రైతు కోసం తెలుగుదేశం నినాదంతో ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్‍లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు.  అనంతరం ఆక్వా రైతులతో కలిసి రోడ్డెక్కనున్నారు. గోదావరి జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 

Mon, 14 Nov 20224:38 IST

దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింిచంది.  నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.  రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. 

Mon, 14 Nov 20224:40 IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  24 కంపార్టుమెంట్లలో  భక్తులు వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం  శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.85 కోట్లు లభించింది.  73,323 మంది భక్తులు  దర్శించుకున్నారు. 29,464 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Mon, 14 Nov 20224:36 IST

రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి

నందిగాం మండలం పెద్దినాయుడుపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి చెందారు.  పలాస ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్‍తో పాటు ఆయన కుమారుడు సంకల్ప్ దుర్మారణం పాలయ్యారు.   భార్య ప్రసన్న లక్ష్మి, కూతురు స్థైర్యాకు తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది.   విశాఖ నుంచి పలాస వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  అర్ధరాత్రి 2 గంటల సమయంలో రహదారి రిటైనింగ్‌ వాల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.  నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

Mon, 14 Nov 20224:40 IST

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసుల ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.  నేడు కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో రద్దీని క్లియర్ చేస్తున్నారు.  వరుస సెలవులతో శ్రీశైలంలో  భక్తుల రద్దీ బాగా పెరిగింది. - గంటల తరబడి ఘాట్‍ రోడ్డులో  వాహనాలు నిలిచిపోయాయి.

ఆర్టికల్ షేర్ చేయండి