Virat Kohli Retirement: విరాట్ కోహ్లికి రిటైర్మెంట్‌ సలహా ఇచ్చిన షాహిద్‌ అఫ్రిది-virat kohli retirement should happen when his career in peak feels shahid afridi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Retirement Should Happen When His Career In Peak Feels Shahid Afridi

Virat Kohli Retirement: విరాట్ కోహ్లికి రిటైర్మెంట్‌ సలహా ఇచ్చిన షాహిద్‌ అఫ్రిది

Hari Prasad S HT Telugu
Sep 13, 2022 05:25 PM IST

Virat Kohli Retirement: విరాట్ కోహ్లికి విలువైన రిటైర్మెంట్‌ సలహా ఇచ్చాడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది. ఎప్పుడు రిటైరవ్వాలో అఫ్రిది చెబుతున్నాడు.

షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి
షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి (Getty Images)

Virat Kohli Retirement: విరాట్‌ కోహ్లి వయసు 33 ఏళ్లు. అతడు ఈజీగా మరో నాలుగేళ్లయినా క్రికెట్‌ ఆడగలడు. ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెటర్లలో ఒకడైన విరాట్‌కు.. మిగతా ప్లేయర్స్‌ కంటే రెండేళ్లు ఎక్కువగానే ఆడే సత్తా ఉంది. పైగా ఆసియా కప్‌తోనే అతడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో తొలి సెంచరీ బాదాడు. టీ20 వరల్డ్‌కప్‌పై కన్నేశాడు.

అయితే ఇప్పుడే అతనికి రిటైర్మెంట్‌ సలహా ఇస్తున్నాడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది. అఫ్రిది ప్రకారం.. కెరీర్‌ హైలో ఉన్నప్పుడే క్రికెట్‌ గుడ్‌బై చెప్పేయాలి. సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్‌లో చివర్లో ఉన్నప్పుడు ఫామ్‌ కోల్పోతుంటారు. రన్స్‌ కోసమో, వికెట్ల కోసమో తంటాలు పడుతుంటారు. గతంలో ఎంతో మంది ప్లేయర్స్‌ కెరీర్‌ చివర్లో ఆయా టీమ్స్‌కు భారంగా మారిన సందర్భాలూ ఉన్నాయి.

కెరీర్‌లో ఎంతో సాధించినా.. చివర్లో ఇలా ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కోవడం క్రికెటర్లకు మింగుడు పడనిదే. అయితే విరాట్‌ కోహ్లికి ఆ పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో అఫ్రిది ఈ సలహా ఇస్తున్నాడు. కెరీర్‌లో కోహ్లి ఎంతో సాధించాడని, అయితే ఎలాంటి క్రికెటర్‌కైనా రిటైర్మెంట్‌ స్టేజ్‌ దగ్గర పడుతున్న సమయంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని అఫ్రిది చెప్పాడు.

"విరాట్‌ కెరీర్‌ అద్భుతంగా సాగింది. మొదట్లో ఇబ్బందులు పడినా.. తర్వాత నిలదొక్కుకొని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడో ఛాంపియన్‌. అయితే అతనికి కూడా రిటైర్మెంట్‌ స్టేజ్‌ అంటూ ఒకటి వస్తుంది. అలాంటప్పుడు కెరీర్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవాలి" అని పాకిస్థాన్‌లోని సమా టీవీతో మాట్లాడుతూ అఫ్రిది చెప్పాడు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. అయితే కెరీర్‌ చివర్లో అన్ని ఫార్మాట్లు ఆడటం చాలా మంది క్రికెటర్లకు సాధ్యం కాదు. ఏదో ఒక ఫార్మాట్‌ నుంచి తప్పుకొని తమ ఫేవరెట్‌ ఫార్మాట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగాలని క్రికెటర్లు భావిస్తారు. ఈ మధ్యే ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా వన్డే క్రికెట్‌కు ఇలాగే గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

అవమానకర రీతిలో టీమ్‌లో స్థానం కోల్పోయి రిటైర్మెంట్‌ ప్రకటించే కంటే.. కెరీర్‌ ఉన్నతంగా ఉన్నప్పుడే ముగిస్తే బాగుంటుందని, ఈ విషయం కోహ్లికి బాగా తెలుసు అని అఫ్రిది అన్నాడు. "రిటైర్మెంట్‌ అనేది టీమ్‌లో నుంచి డ్రాప్‌ చేసే పరిస్థితిలో రాకూడదు. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే ఆ పని చేయాలి. కొంతమంది ప్లేయర్స్‌కే అది బాగా తెలుసు. విరాట్‌ కోహ్లి కూడా అందులో ఒకడని భావిస్తున్నా. తన కెరీర్‌ను అతడెలా మొదలుపెట్టాడో అలాగే ముగిస్తాడని అనుకుంటున్నా" అని అఫ్రిది అన్నాడు.

WhatsApp channel