Telugu News  /  Sports  /  T20 World Record 501 Runs Scored In South Africa Domestic Match
డేవాల్డ్ బ్రూవీస్
డేవాల్డ్ బ్రూవీస్ (Twitter)

Highest T20 Score in World: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. అత్యధిక స్కోరు నమోదు.. 501 పరుగులు

02 November 2022, 8:34 ISTMaragani Govardhan
02 November 2022, 8:34 IST

Highest T20 Score in World: దక్షిణాఫ్రికా దేశవాళీ మ్యాచ్‌లో టీ20 వరల్డ్ రికార్డు నమోదైంది. ఇరుజట్లు కలిపి 500కి పైగా పరుగులు నమోదు చేశాయి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి 501 పరుగులతో రికార్డు సృష్టించాయి.

Highest T20 Score in World: క్రికెట్‌లో రికార్డులు బ్రేక్ చేయడం సర్వ సాధారణం. అందులోనూ టీ20 క్రికెట్‌లో అసాధ్యాలు సుసాధ్యం చేయడం మంచి నీళ్ల ప్రాయమే. అయితే కొన్ని రికార్డులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. వాటిలోనూ గుర్తుపెట్టుకునేవి వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు. అలాంటి రికార్డే దక్షిణాఫ్రికా దేశవాళీ టీ20 మ్యాచ్‌లో నమోదైంది. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ అనే ఈ సౌతాఫ్రికా దేశవాళీ టోర్నీలో టైటాన్స్-నైట్స్ అనే ఫ్రాంఛైజీ జట్లు పోటీ పడగా.. రెండు టీమ్స్ కలిపి 501 పరుగులతో రికార్డు సృష్టించాయి.

ట్రెండింగ్ వార్తలు

ముందు బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగా.. అనంతరం ఈ భారీ లక్ష్య ఛేదనలో నైట్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల చేసి 41 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ ఇరుజట్లు కలిపి 36 సిక్సర్లు నమోదయ్యాయి. ఇరు జట్లు కలిపి 501 పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2016-17 సీజన్‌లో సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగా జట్ల మధ్య నమోదైన 497 పరుగులే అత్యధికం.

టైటాన్స్ జట్టు 271 పరుగులను కేవలం 3 వికెట్లు కోల్పోయే సాధించం విశేషం. ఈ జట్టు ఓపెనర్ డేవాల్డ్ బ్రూవీస్ 57 బంతుల్లో 162 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా పొట్టి ఫార్మాట్‌లో మూడో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా బ్రూవీస్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు2013లో క్రిస్ గేల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 175 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 2018లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 172 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికాలో అత్యధిక టీ20 స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా బ్రూవీస్ ఘనత సాధించాడు. అంతేకాకుండా పురుషుల టీ20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన అతి చిన్న దక్షిణాఫ్రికా క్రికెటర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. 19 సంవత్సరాల 185 రోజుల వయస్సులో ఈ రికార్డును అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే టీ20ల్లో సెంచరీ చేసిన ఆరో పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు.

బ్రూవీస్ 52 బంతుల్లో 150 పరుగులను సాధించడం విశేషం. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గేల్‌కు ఈ ఘనత సాధించడానికి 53 బంతులు అవసరమయ్యాయి. బ్రూవీస్ సెంచరీని మాత్రం 35 బంతుల్లో చేసి ఈ రికార్డు సాధించిన రెండో వేగవంతమైన దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు. అతడు సెంచరీ సాధించడానికి 284.21 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఐదో అత్యధికం కాగా.. దక్షిణాఫ్రికా తరఫున మాత్రం ఇదే అధికం.