Sachin Tendulkar Double Century: సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇదే రోజు.. క్రికెట్ చరిత్రను తిరగరాసిన సచిన్-sachin tendulkar scores double century in odi cricket on this day february 24th in 2010 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sachin Tendulkar Scores Double Century In Odi Cricket On This Day February 24th In 2010

Sachin Tendulkar Double Century: సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇదే రోజు.. క్రికెట్ చరిత్రను తిరగరాసిన సచిన్

Hari Prasad S HT Telugu
Feb 24, 2023 11:11 AM IST

Sachin Tendulkar Double Century: సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇదే రోజు.. క్రికెట్ చరిత్రను తిరగరాశాడు సచిన్ టెండూల్కర్. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా మాస్టర్ నిలిచాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ చేసిన తర్వాత సచిన్ అభివాదం
వన్డే క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ చేసిన తర్వాత సచిన్ అభివాదం

Sachin Tendulkar Double Century: సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ అని ఊరికే అనరు. ప్రపంచంలో ఎలాంటి క్రికెటర్ కు అయినా దారి అతడు చూపిస్తాడు. మిగతా వాళ్లు కేవలం ఫాలో అవుతారు. క్రికెట్ లో ఎలాంటి రికార్డు అయినా మాస్టర్ కు దాసోహం కావాల్సిందే. ఆ రికార్డు మరో ప్లేయర్ కు సవాలు విసరాల్సిందే. అందుకే 13 ఏళ్ల కిందట అప్పటి వరకూ వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని డబుల్ సెంచరీ రికార్డు కూడా మొదట మాస్టర్ కే దాసోహమైంది.

ట్రెండింగ్ వార్తలు

2010, ఫిబ్రవరి 24.. వన్డే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఆ రోజే సచిన్ టెండూల్కర్ ఈ ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. అప్పటికే వన్డే క్రికెట్ మొదలై సుమారు నాలుగు దశాబ్దాలు కావస్తున్నా.. ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. అంతకుముందు వరకు పాకిస్థాన్ ప్లేయర్ సయీద్ అన్వర్ 194 పరుగులతో వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డును కలిగి ఉన్నాడు.

అయితే ఆ రోజు సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో మాస్టర్ డబుల్ కలను సాకారం చేశాడు. గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం ఈ అద్భుతానికి వేదికైంది. 50వ ఓవర్ మూడో బంతిని ఆఫ్ సైడ్ లో ఆడి సింగిల్ తీసిన సచిన్.. 200వ పరుగు అందుకున్నాడు. 147 బంతుల్లోనే మాస్టర్ ఈ డబుల్ సెంచరీ చేశాడు. ఈ భూమండలంపై ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ అంటూ అప్పుడు కామెంటరీ ఇచ్చిన రవిశాస్త్రి అనడం విశేషం.

నిజానికి అంతకుముందే మహిళల వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదైంది. 1997లోనే ఆస్ట్రేలియా ప్లేయర్ బెలిండా క్లార్క్.. డెన్మార్క్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసింది. ఇక సచిన్ డబుల్ సెంచరీ చేసిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏకంగా 401 పరుగులు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా 248 పరుగులకే ఆలౌటైంది.

అంతకుముందు వరకూ 1999లో హైదరాబాద్ లో న్యూజిలాండ్ పై చేసిన 186 పరుగులే సచిన్ వన్డే కెరీర్ లో అత్యధిక స్కోరుగా ఉండేది. తన ఈ తొలి డబుల్ సెంచరీని భారత అభిమానులకు అతడు అంకితమిచ్చాడు. సచిన్ డబుల్ సెంచరీ తర్వాత మళ్లీ వన్డే క్రికెట్ లో 9 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. మొత్తం ఈ 10 డబుల్ సెంచరీల్లో ఏడు ఇండియన్సే చేయడం విశేషం. అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలతో రోహిత్ టాప్ లో ఉండగా.. సెహ్వాగ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లు కూడా డబుల్ సెంచరీలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం